పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిన చంద్రబాబుకు ఇంకా ఖాళీ భవనాలతో పనేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రా ప్రభుత్వం ఆధీనంలో ఖాళీగా ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలను తెలంగాణాకు ఇచ్చేస్తే పోలా. ఎలాగూ సచివాలయంలో తన భాగంగా వచ్చిన ఐదు బ్లాకులను ఏపి ప్రభుత్వ దాదాపు ఖాళీ చేసేసింది ఎప్పుడో. ఎప్పుడైతే ‘ఓటుకునోటు’ కేసు వెలుగుచూసిందో అప్పుడో చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుండి తన మకాంను విజయవాడకు మార్చేసారు. ఇదే విషయమై గురువారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీల సమావేశంలో చర్చ జరిగింది.

 ఆ సమావేశంలో ఖాళీగా ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలను తమకు ఇచ్చేయమంటూ తెలంగాణా మంత్రి హరీష్ రావు ఏపి మంత్రులను కోరారు. ఖాళీ భవనాలకు తాళాలు పెట్టుకుని పైగా వాటికి అద్దెలు చెల్లించటమెందుకని హరీష్ వేసిన ప్రశ్నలో లాజిక్ ఉంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలను వెలగపూడిలో జరపటానికి ప్రభుత్వ ఏర్పాట్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇటు సచివాలయం భవనాలూ వాడక, అటు అసెంబ్లీ భవనాన్ని వాడకోకుండా మరి ఇంకా ఎందుకు తన వద్దే ఏపి ప్రభుత్వం అట్టేపెట్టుకున్నట్లు? పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిన చంద్రబాబుకు ఇంకా ఖాళీ భవనాలతో పనేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ ఇద్దరు సిఎంలు విభజన చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి వచ్చే ఐదేళ్ల సంగతి ఆలోచించకుండా చంద్రబాబు భవనాలను ఇపుడే ఇచ్చేయాలని హరీష్ వాదన వినిపించటం గమనార్హం.