మొత్తానికి ఏపి సమస్యలపై తెలంగాణా ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా మాట్లాడారు. నిజంగా ఇది అభినందించాల్సిన విషయమే. ఇంతకీ జరిగిందేమిటంటే,  రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలకు కెసిఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పూర్తి మద్దతు ప్రకటించారు. గురువారం పార్లమెంటులో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఏపికి పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని స్పష్టంగా చెప్పారు. కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండచ్చు లేదా ఎన్డీఏ ఉండచ్చు కానీ ప్రభుత్వం అన్నది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుదన్నారు. అందుకే అధికారంలో  ఎవరుంటే సమస్యల పరిష్కారం బాధ్యత ఆ పార్టీపైనే ఉంటుందన్నారు.  కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలన్నీ యావత్ దేశమంతా చూస్తోందన్నారు. కాబట్టి ఏపిలో ప్రస్తుతం జరుగుతున్న విభజన సమస్యలను కేంద్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు.