చిత్తూరు జిల్లా పీలేరులో ప్రసిద్ధి చెందిన ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకటరమణారెడ్డి (55) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి స్థానిక చిత్తూరు మార్గంలో ఎంజేఆర్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు పలు విద్యాసంస్థలను స్థాపించారు. 

పీలేరు ఎంపీపీగాను, బోడుమల్లువారి పల్లె పంచాయతీ సర్పంచుగా కూడా వెంకటరమణారెడ్డి పనిచేశారు. వెంకటరమణారెడ్డి గురువారం సాయంత్రం పులిచెర్ల మండలం కొడిదిపల్లె దగ్గర తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెల్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. 

దాదాపు కిలో మీటరు దూరం వరకు మృతదేహాన్ని రైలు ఈడ్చుకుపోయింది. దీంతో ట్రాక్ మీద చాలా దూరం వరకు అవశేషాలు చెల్లాచెదురుగా పడ్డాయి. రైలు రావడానికి రెండు గంటల ముందు నుంచే ఆయన కొడిది పల్లె రైల్వే గుటు దగ్గర ఉన్నారని, తన కారును ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉంచాలని డ్రైవర్ కు తెలిపినట్లు సమాచారం. 

డ్రైవర్ వెళ్లిపోయన తరువాత అక్కడే బజ్జీలు తింటూ గడిపారు. రైలు వచ్చే టైం అవ్వడంతో రైల్వే గేట్ సిబ్బంది అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆయనకు సూచించారు. అయితే వెంకటరమణారెడ్డి ఆ మాట వినిపించుకోకుండా.. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు వచ్చినప్పుడు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రైల్వే సిబ్బంది తెలిపారు. 

రైలు వెళ్లిపోయాక ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులకు, స్థానికులకు అందించారు. దీంతో వెంకటరమణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న సమాచారం వెలుగులోకి వచ్చింది. వెంకటరమణారెడ్డికి భార్య మాధవిలత, కుమారుడు అవినాష్‌రెడ్డి ఉన్నారు. 

వెంకటరమణారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. తండ్రి రెడ్డప్పరెడ్డి అనారోగ్యంతో తిరుపతిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయనను డిశ్చార్జ్‌ చేసుకుని ఇంటికి తీసుకువచ్చారు. గురువారం కళాశాలలో అధ్యాపకులు, సిబ్బందితోనూ గడిపారని తెలిసింది. సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. 

విద్యా సంస్థలకు చెందిన బస్సులను అధికారుల వినతి మేరకు ఎన్నికల విధులకు పంపేందుకు గురువారం ఏర్పాట్లు కూడా చేశారని, గంటల వ్యవధిలోనే ఆయన రైలు కింద పడి మరణించినట్లు దుర్వార్త వినాల్సి వచ్చిందని సిబ్బంది కంటతడి పెట్టారు.

గతంలో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా .. వాటిని అధిగమించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీతో పాటు అనుబంధ విద్యా సంస్థల్లోనూ అడ్మిషన్లు బాగా జరిగాయని, వ్యక్తిగతంగానూ ఎలాంటి సమ్యలు లేవని సన్నిహితులు తెలిపారు. 

రాజకీయంగ మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాధరెడ్డి అనుచరుడిగా ఉంటున్న వెంకటరమణారెడ్డి 2014 శాసనసభ ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. వ్యాపార పరంగా, రాజకీయాంగా ఎలాంటి సమస్యలు లేవని సన్నిహితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన కారణం ఏమిటనేది ఎవరికీ తెలియడం లేదు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో రైల్వే పోలీసులు ఈ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.