ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసుల కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మరిన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే.. మామూలు రోజుల్లో జనాలు లాక్ డౌన్ బాగానే పాటించినా.. ఆదివారం వస్తే మాత్రం బయటకు అడుగుపెడుతున్నారని అధికారులు చెబుతున్నారు.

Also Read కరోనాపై పోరాటంలో అలసత్వం... ఐదుగురు వాలంటీర్ల తొలగింపు...

మరీ ముఖ్యంగా చికెన్, మటన్ కోసం ఎగబడుతూ.. ఆ దుకాణాల ముందు క్యూలు కడుతున్నారని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు చెప్పారు. దీనివలన సాధారణ రోజుల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు ఇచ్చిన వెసులుబాటు ఉండబోదని స్పష్టం చేశారు. అలానే జిల్లాలోని అన్ని రెడ్‌జోన్ల పరిధిలో ఉన్న వారు ఎవరూ బయటకు వెళ్లే వీలులేదని చెప్పారు. 

మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు మాత్రం ఆదివారం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అలానే రోజు మార్చి రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ను జిల్లా అంతటా అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పారు. దీనిదృష్ట్యా ప్రజలు కనీసం పదిహేను రోజులకు అవసరమైన నిత్యావసర సరుకులు, మందులు, పిల్లలకు పాల డబ్బాలు వంటివి సమకూర్చుకోవాలని సూచించారు.

 అవసరమైన పక్షంలో కూరగాయలు రోజు మార్చి రోజు ఉదయం 6 నుంచి 9 గంటలలోపు కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధానికై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.