కరోనాపై పోరాటంలో అలసత్వం... ఐదుగురు వాలంటీర్ల తొలగింపు
కరోనా నిర్మూలనలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో అలసత్వం వహించిన ఐదుగురు వార్డు వాలంటీర్లపై ప్రభుత్వం వేటు వేసింది.
తాడేపల్లి: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యమైనది ఇంటింటి సర్వే. ఇటీవల నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహించి కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారిని గుర్తించే ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. ఈ క్రమంలో విధుల్లో అలసత్వం వహించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం.
ఇలా తాడేపల్లి లోని బ్రహ్మానంద పురంలో ఐదుగురు వార్డు వాలంటరీలను తొలగించిన అధికారులు. సచివాలయ కార్యదర్శికి సర్వే రిపోర్ట్స్ ఇవ్వకుండా తమ విధుల విషయంలో స్పందించక పోవటం,నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాలతో వారిని తొలగించారు. వారిని విధులనండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలా తొలగించిన వారిలో నలుగురు మహిళ వాలంటీర్లు వున్నారు. ఇంటి ఇంటి సర్వే చేయకుండా, ప్రజలతో సరిగా వ్యవహరించకుండా, దుర్బాష లాడుతున్నట్లు కూడా వారిపై ఫిర్యాదులున్నట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలో వారిని తొలగించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారంనాడు పది గంటల్లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరుకుంది. తాజాగా ఐదు కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య 386కు చేరుకుంది.
శుక్రవారంనాడు గుంటూరు జిల్లాలో 7, తూర్పు గోదావరి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. పది మంది కోలుకున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 82 కేసులు నమోదయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడిలోని ఉపాధ్యాయుడి నివాసంలో ఇద్దరికి, ఉపాధ్యాయుడి ఇంటి సమీపంలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 370కి పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 గంటల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం తెలిపింది. అనంతపురం జిల్లాలో ఈ రెండు కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 892 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. గురువారంనాడు అనంతపురం జిల్లాలోని మనురేవుకు చెందిన 70 ఏల్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. గుంటూరులోని ఎన్ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.
గురువారంనాడు 363 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం 365కు చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 కేసులు నమోదయ్యాయి. గురువారంనాడు కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కు చికిత్స పొంది ఇప్పటి వరకు పది మంది డిశ్చార్జీ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదు.