Today’s News Roundup – 24th August 2025: అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత, తెలంగాణలో స్థానిక షెడ్యూల్ 29న మంత్రి వర్గ సమావేశం, అనిల్‌ అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు, రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు, అర్జెంటీనాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌.. కేరళకు మెస్సీ రాక. 

Today’s News Roundup – 24th August 2025: 

అమెరికాకు పార్సిల్‌ షాక్‌! తాత్కాలికంగా నిలిపివేసిన భారత్‌ తపాలా సేవలు

అమెరికా ప్రభుత్వం పన్ను నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా భారత్‌ నుంచి అమెరికాకు తపాలా పార్సిల్‌ సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. ఇకపై అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్‌ ఐటమ్స్‌పై వాటి విలువతో సంబంధం లేకుండా కస్టమ్స్‌ డ్యూటీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 100 డాలర్ల లోపు ఉన్న లేఖలు, డాక్యుమెంట్లు, బహుమతులు మాత్రం పన్ను మినహాయింపులో ఉంటాయని స్పష్టం చేసింది.

ఇప్పటికే పార్సిల్‌ పంపిన వినియోగదారులు రీఫండ్‌ పొందవచ్చని తపాలా శాఖ తెలిపింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యంపై చింతిస్తూ, సాధ్యమైనంత త్వరగా పోస్టల్‌ సేవలను పునఃప్రారంభించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. అమెరికా తాజా నిర్ణయం భారత్‌తో పాటు ఫ్రాన్స్, ఆస్ట్రియా, బెల్జియం, స్కాండినేవియా దేశాలను కూడా ప్రభావితం చేస్తోంది. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య యుద్ధం భాగంగా ఇలాంటి టారిఫ్‌ షాక్‌లు వరుసగా ఎదురవుతున్నాయి.

ధర్మస్థల వివాదం వెనుక నిజం? మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య అరెస్టు

Dharmasthala Controversy: కర్ణాటకలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం ధర్మస్థలపై తప్పుడు ప్రచారం చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సీఎన్‌ చిన్నయ్య అలియాస్‌ చిన్నప్పను శనివారం సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం బెళ్తంగడి అదనపు సివిల్‌, జేఎంఎఫ్‌సీ న్యాయస్థానంలో హాజరు పరిచారు. విచారణ నిమిత్తం నిందితుడిని పది రోజుల పాటు సిట్‌ కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. చిన్నయ్య గతంలో “పుణ్యక్షేత్రం చుట్టుపక్కల వందల మృతదేహాలను ఖననం చేశాను” అని చెప్పి సంచలనం రేపిన విషయం తెలిసిందే.

ఆ ప్రకటనల ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి 17 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినా పెద్దగా ఆధారాలు దొరకలేదు. రెండు చోట్ల లభించిన ఎముకలు మాత్రం స్థానికులవేనని అనుమానిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియపై ఇప్పటికే రూ.3 కోట్లకుపైగా ప్రభుత్వ ఖజానా ఖర్చయింది. తాజాగా చిన్నయ్య తన వాంగ్మూలానికి యూటర్న్‌ ఇచ్చాడు. “నాకు ఒక పుర్రె ఇచ్చి న్యాయస్థానంలో చూపమన్నారు. కొన్ని స్థలాలను చూపమని సూత్రధారి సూచించాడు. నేను పాత్రధారి మాత్రమే, సూత్రధారి వేరే ఉన్నాడు” అని ప్రాథమిక విచారణలో తెలిపినట్లు సమాచారం.

అనిల్‌ అంబానీకి మరో షాక్‌! కంపెనీల్లో సీబీఐ సోదాలు

Anil Ambani CBI Raids: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఈడీ దాడులు ఎదుర్కొన్న ఆయన కంపెనీలు, తాజాగా సీబీఐ దాడుల్లో చిక్కుకున్నాయి. ముంబైలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌కామ్‌) ప్రధాన కార్యాలయంతో పాటు అనిల్‌ అంబానీ నివాసంలోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి తీసుకున్న రూ.2,929.05 కోట్ల రుణాన్ని చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

సీబీఐ వర్గాల ప్రకారం, నిందితులు నేరపూరిత కుట్రలో భాగంగా తప్పుడు ప్రాతినిధ్యం వహించి ఎస్బీఐ నుంచి రుణాలు పొందారని ఆరోపిస్తోంది. పొందిన నిధులను దుర్వినియోగం చేసి ఇతర విభాగాలకు మళ్లించడం, అమ్మకాల ఇన్వాయిస్‌ ఫైనాన్సింగ్‌ను తప్పుగా వినియోగించడం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ లిమిటెడ్‌ ద్వారా ఆర్‌కామ్‌ బిల్లులను డిస్కౌంట్‌ చేయడం, ఇంటర్‌-కంపెనీ డిపాజిట్ల ద్వారా నిధులను తరలించడం వంటి ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ సోదాలతో అనిల్‌ అంబానీ ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ కేబినెట్‌ భేటీ: సెప్టెంబర్ లో స్థానిక షెడ్యూల్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 29న రాష్ట్ర సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గడువు వంటి అంశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్‌ ముసాయిదా గవర్నర్‌ వద్ద పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రిజర్వేషన్లకే అమలు కల్పిస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ప్రతిపాదనను ముందుకు తేనున్నట్లు సమాచారం.

మరోవైపు.. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ గడువులోపు నిర్వహణపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై కేబినెట్‌లో విస్తృత చర్చ జరుగనుంది. కాబట్టి ఆగస్టు 29 సమావేశంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్, కాళేశ్వరం కమిషన్‌ నివేదిక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపై తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

రిచెస్ట్ సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనిక సీఎం గా నిలిచారు. ADR నివేదిక ప్రకారం ఆయన ఆస్తి ₹931 కోట్లు, 1992లో స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ద్వారా ఎక్కువగా సంపాదన వస్తుందని తెలిపారు. దేశంలోని 30 ముఖ్యమంత్రులలో అత్యధిక ఆస్తి ఆయనకే ఉన్నది.

ఇతర ముఖ్యమంత్రులలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు ₹332 కోట్లు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ₹51 కోట్లు, మమతా బెనర్జీ ₹15 లక్షలతో అత్యల్పంగా ఉన్నారు. చంద్రబాబు‌పై ₹10 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ 7000 రూపాయల పెట్టుబడితో ప్రారంభమై, ఇప్పుడు 17 రాష్ట్రాల్లో 3 లక్షల రైతులతో ₹4,000 కోట్ల టర్నోవర్ సాధించింది.

అర్జెంటీనాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌.. కేర‌ళకు వ‌స్తున్న మెస్సీ

Lionel Messi: ఫుట్‌బాల్‌ అభిమానులకు శుభవార్త! సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ లీడ్ చేస్తున్న అర్జెంటీనా జట్టు నవంబరులో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌ కోసం కేరళకు రాబోతోంది. ఈ విషయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ధృవీకరించింది, కానీ జట్టు ఎవరితో మ్యాచ్‌ ఆడుతుందో ఇంకా స్పష్టం చేయలేదు.

కేరళ క్రీడామంత్రి అబ్దుర్ రహిమాన్ ప్రకారం, నవంబర్ 10–18 మధ్య ఈ మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది. అర్జెంటీనా జట్టు అక్టోబరులో యూఎస్‌లో, నవంబరులో భారత్‌లో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుందని ఫుట్‌బాల్‌ సమాఖ్య వెల్లడించింది. మెస్సీ డిసెంబరులో మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు రాబోతుందని ముందే వార్తలు వచ్చినప్పటికీ, తాజా ప్రకటనతో ఇప్పుడు మెస్సీ భారత్‌ రావడం ఖాయమని తెలుస్తోంది.