Asianet News TeluguAsianet News Telugu

టాప్ స్టోరీస్ : ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్... కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలివే...

శుక్రవారం మూడు ప్రధాన పత్రికల్లోనూ వచ్చిన ప్రధాన వార్తల సమాహారం ఈ టాప్ స్టోరీస్. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. గాజాలో ఇజ్రాయెల్ మరో యుద్ధ అంకానికి తెరలేపింది. తెలంగాణలో నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనుంది.. ఈ వార్తలతో పాటు తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల ప్రచారాలకు సంబంధించిన వార్తలు ప్రముఖంగా ఉన్నాయి. 

today top stories - bsb
Author
First Published Nov 17, 2023, 7:54 AM IST

1
భారత్ కి మరో అగ్ని పరీక్ష..  ఫైనల్ ప్రత్యర్థి ఆసిసే..

భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురు చూసిన సందర్భం రానే వచ్చింది. ప్రపంచ కప్ ఫైనల్లో భారత ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. రోహిత్ సేనకు 2023 వన్డే ప్రపంచ కప్ లో మరోసారి తీవ్ర పోటీ ఎదురు కానుంది. 2003లో టీమిండియాకు పీడకలను మిగిల్చిన, ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియానే మరోసారి ఇండియాకు ఫైనల్ ప్రత్యర్థి కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య సెమీఫైనల్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్లో  దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కి చేరుకుంది. 

ICC Cricket World Cup 2023: ఫైనల్లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నున్న భార‌త్..

2
ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఘెరావ్...

ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి తానేటి వనితను తూర్పుగోదావరి జిల్లాలో ఘెరావ్ చేశారు. దళిత యువకుడు బొంతు మహేంద్ర ఆత్మహత్య చేసుకోగా అతడి కుటుంబాన్ని పరామర్శించి, పరిహారం ఇవ్వడానికి వెళ్ళిన హోమ్ మంత్రి తానేటి వనితను దొమ్మేరు ఎస్పీ పేట ప్రజలు అడ్డుకున్నారు. గంటన్నర పాటు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైనే ఘెరావ్ చేశారు. మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. ఎన్నికల్లో మీ విజయానికి కృషి చేశాం.. అయినా.. ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకు వచ్చారు?  మేము చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తే మహేంద్ర బతికేవాడు కదా? అంటూ ఆగ్రహావేషాలతో ఊగిపోయారు. మహేంద్ర ఆత్మహత్య నేపథ్యంలో దొమ్మేరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. 

3
ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం 

గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఆ సభ దగ్గర ఓ యువకుడు రెండు బుల్లెట్లతో సంచరించడం కలకలం రేపింది. ఆ యువకుడు సంగారెడ్డి జిల్లా రాయికోడు గ్రామానికి చెందిన ఎం.డి అస్లం (35)గా  గుర్తించారు. అతను ఓ యూట్యూబ్ ఛానల్ లో విలేకరిగా పనిచేస్తున్నాడు. చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని రిపోర్టు చేయడం కోసం నర్సాపూర్ కు వచ్చాడు.  విలేకరుల గ్యాలరీలోకి వస్తుండడంతో గుర్తింపు కార్డు చూపించమన్నారు. కార్డు తీస్తున్న క్రమంలో పర్సులో రెండు బుల్లెట్లు  కనిపించాయి. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. 

పూర్తి కథనం

4
నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో.. తాయిలాలు ఇవే.. 

నేడు తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. ఈ మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలపై ప్రత్యేక వార్తా కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఇందులో ముఖ్యంగా ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పథకం కింద ఆర్థిక సాయం, యువతులపెళ్లికి లక్ష రూపాయలతో పాటు, ఇందిరమ్మ కానుకగా  తులం బంగారం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, ముఖ్యమంత్రి కార్యాలయంలో రోజూ ప్రజా దర్బార్ లాంటి అనేక హామీలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోను నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విడుదల చేయనున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ..

5
మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్లలో నేడే పోలింగ్ 

శుక్రవారం నాడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. చత్తీస్గడ్ లో మొత్తం 90 సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నవంబర్ ఏడవ తేదీన మొదటి దశలో 20 నక్సల్ బరి ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు రెండో, తుది దశలో 70 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్ లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలు నేడు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని సాక్షి ప్రత్యేకంగా ప్రచురించింది. 

6
శబరిమలకు ప్రత్యేక రైలు

శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిసెంబర్, జనవరి నెలలో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి. దీనికి సంబంధించిన రైళ్లు తేదీలు, వివరాలతో పూర్తి కథనాన్ని సాక్షి ప్రచురించింది. 

7
టార్గెట్ దక్షిణ గాజా..కరపత్రాలు పంపిణీ చేసిన ఇజ్రాయెల్..

గాజాలో హమాస్ మిలిటెంట్లపై యుద్ధం పేరుతో ఇజ్రాయిల్ సైన్యం విరుచుకుపడుతోంది. వైమానిక, భూ తల దాడులతో భారీ భవనాలను నిమిషాల్లో శిథిలాల దిబ్బలుగా మార్చేస్తుంది. నిత్యం వందల సంఖ్యలో జనం చనిపోతున్నారు. కాళ్లు, చేతులు కోల్పోయి అంగవికలురుగా, క్షత గాత్రులుగా మారుతున్నారు. యుద్ధం దక్షిణ గాజాకు కూడా విస్తరించే   సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ గాజా నుంచి వెంటనే వెళ్లి పోవాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తుంది ఇజ్రాయిల్ సైన్యం. ఉత్తర గాజాలోనూ యుద్ధానికి ముందు ఇలాంటి కరపత్రాలే సైన్యం విడిచిపెట్టింది. దీంతో ఇప్పుడు దక్షిణ గాజా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

8
చంద్రబాబు మెడికల్ రిపోర్టుపై వ్యంగ్యాస్త్రాలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్ట్‌పై ..అనారోగ్యంతో వున్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చని, న్యాయస్థానం అనుమతిస్తే బెయిల్ వస్తుందని వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అలా కాకుండా ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని ఆరోపించారు. వైద్యపరమైన కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వచ్చిందని, ఇప్పుడు ఆ బెయిల్‌పై మరికొంతకాలం బయట వుండేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

చంద్రబాబు మెడికల్ రిపోర్ట్‌పై అనుమానాలు.. జైలుకు వెళ్లకుండా వుండేందుకే ఈ డ్రామా
 
9
జీరో కథ కంచికేనా? 

జీరో డోర్ నెంబర్లు, సిమిలర్ ఓట్లు, మృతుల ఓట్ల జాబితాలోనే,  వలసదారులకు స్వస్థలాల్లోనే ఓటర్ కార్డులు.. ఇలా పది లక్షలకు పైగా తొలగించాల్సిన ఓట్లు చలామణిలో ఉన్నాయంటూ.. ఆంధ్రజ్యోతి ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వీటిమీద ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా ముసాయిదా ఓటర్ల జాబితాలో చేరిపోయాయని చెప్పుకొచ్చింది. ఫాం-7ను అడ్డుపెట్టుకుని అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించినట్లు టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చినా.. చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ముసాయిదాలో దొర్లిన తప్పులపై కేంద్ర ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందంటూ కథనాన్ని రాసుకొచ్చింది. 

10
9న ప్రమాణం చేస్తా.. రేవంత్ రెడ్డి 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న  సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతి  చేసిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో తన ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం తనకి ఏమి చెప్పలేదని  అన్నారు. కానీ, పదేళ్లపాటు అధికారంలో కనుక కాంగ్రెస్ ఉంటే తెలంగాణలో మార్పు చూపిస్తానని, ఆ మేరకు తనకు విజన్ ఉందని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 9వ తేదీన ఎన్టీఆర్, వైయస్ సెంటిమెంటుతో ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios