మళ్లీ డిల్లీకి పయనమైన నారా లోకేష్ ... తండ్రి విడుదలైనా న్యాయంకోసం పోరాటమే..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలునుండి విడుదలైనా ఆయన తనయుడు నాారా లోకేష్ అలుపెరగకుండా న్యాయపోరాటం కొనసాగిస్తూనే వున్నారు. ఇందుకోసం ఆయన మరోసారి డిల్లీకి పయనం అయ్యారు.

అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ దేశ రాజధాని న్యూడిల్లీకి బయలుదేరారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు జైలునుండి విడుదలైనా ఆయనపై కేసులు పెడుతూనే వున్నారు. అలాగే తనపైనా ప్రభుత్వం కేసులు పెడుతుండటంతో కొద్దిరోజులుగా డిల్లీలోనే ఎక్కువగా వుంటూ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు లోకేష్. విజయవాడలోని ఏసిబి కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో చంద్రబాబుపై కేసుల విచారణ కొనసాగుతోంది. వీటిపై చర్చించేందుకు మరోసారి లోకేష్ డిల్లీకి వెళుతున్నారు.
ముఖ్యంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలుచేసారు. ఈ పిటిషన్ పై జరుగుతున్న విచారణపై తమ లాయర్లతో మాట్లాడేందుకు లోకేష్ డిల్లీ వెళుతున్నట్లు సమాచారం. అలాగే చంద్రబాబుపై పెట్టిన ఇతర కేసుల గురించి కూడా లోకేష్ న్యాయ నిపుణులు, సుప్రీం కోర్టు లాయర్లతో చర్చించనున్నారు.
నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు సుదీర్ఘ న్యాయపోరాటమే చేసారు. ఓవైపు చంద్రబాబును సీఎం జగన్ కక్షసాధింపుతోనే అరెస్ట్ చేయించారని... ఆయన ఎలాంటి అవినీతిని పాల్పడలేదని ప్రజల్లోకి తీసుకెళుతూ ప్రజల్లో పోరాటం చేసాడు లోకేష్. ఇదే క్రమంలో ఏసిబి కోర్టులో కాకుంటే హైకోర్టు అక్కడ కాకుంటే సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తున్నాడు. చివరకు 53 రోజుల తర్వాత తన తండ్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలునుండి బయటకు తీసుకురావడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు.
నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన దగ్గర్నుండి నిన్న విడుదల వరకు తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి పార్టీ తరపున నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు లోకేష్. అలాగే కొద్దిరోజులు డిల్లీలోనే వుండి సుప్రీం కోర్టు న్యాయవాదులు, ప్రముఖ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఎలాగైతేనేం తండ్రికి బెయిల్ వచ్చేంతవరకు పోరాటం చేసి బయటకు తీసుకువచ్చాడు లోకేష్.
చంద్రబాబు జైలుకు వెళ్లాక నారా భువనేశ్వరి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఓవైపు భర్తకోసం పోరాటం చేస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీని నడిపించారు. ఆమెకు సోదరుడు బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబం అండగా నిలిచారు. అలాగే టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా భువనేశ్వరికి మద్దతుగా నిలిచారు. దీంతో ఆమె జైల్లోని భర్త సలహాలు, సూచనలు తీసుకుంటూ టిడిపిని నడిపించారు.