నేడు చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు విచారణ... ఏసిబి కోర్టులోనూ ఆ కేసుల విచారణ
చంద్రబాబుపై అధికార వైసిపి వరుసగా కేసులు నమోదుచేస్తున్న విషయం తెెలిసిందే. ఇలా నమోదయిన కేసుల్లో కొన్నింటి విచారణ నేడు హైకోర్టు, ఏసిబి కోర్టులో జరగనున్నాయి.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైలుకు వెళ్లిన చంద్రబాబు మరికొన్ని కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. టిడిపి హయాంలో భారీ అవినీతి జరిగిందని... అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకున్నాడని వైసిపి నాయకులు ఆరోపిస్తోంది. కేవలం ఆరోపణలే కాదు ఒకటి తర్వాత ఒకటి కేసులు పెడుతూనే వున్నారు. ఇలా చంద్రబాబును ఎన్నికల ముందు కేసులతో సతమతం చేస్తోంది వైసిపి.
వివిధ అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబుపై నమోదైన పలు కేసులు ఇవాళ న్యాయస్థానాల్లో విచారణకు రానున్నాయి. వీటిలో ముఖ్యమైనది స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ. ఈ కేసులోనే సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేయగా దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబుకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ ఆయన రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇక చంద్రబాబుపై నమోదుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేసాడు. ఈ పిటిషన్ పై కూడా ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి వుందని... అందుకోసం సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి కోర్టును కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడి,చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటు మొత్తం 44మందిని ఉండవల్లి ప్రతివాదులుగా చేర్చారు.
Read More ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంలో స్వల్ప ఊరట: స్కిల్ కేసుపై దీపావళి తర్వాత తీర్పు
ఇవిలావుంటే టిడిపి హయాంలో చేపట్టిన పైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో భారీ అవకతవకలు జరిగినట్లు వైసిపి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిఐడి ఏసిబి కోర్టులో పిటి వారెంట్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటి వారెంట్ పై ఇవాళ విచారణ జరగనుంది.
మరోవైపు ఏపి ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడినవారి అస్తులను అటాచ్‌మెంట్ చేయాలని ఏసిబి కోర్టులో ఇప్పటికే అధికారులు పిటిషన్ దాఖలు చేసారు. టెరాసాఫ్ట్ ఎండితో పాటు చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరు హరిప్రసాద్ కు చెందిన ఏడు స్థిరాస్తులు సిఐడి అధికారులు గుర్తించారు.విశాఖపట్నం, గుంటూరు లతో పాటు హైదరాబాద్ లో వివిధ అస్తులు గుర్తింంచి వీటి జప్తుకు హోంశాఖ అనుమతి కూడా పొందారు. ఏసిబి కోర్టు అనుమతి కూడా సిఐడి కోరగా దీనిపై ఇవాళ విచారణ జరిపి న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.