వైసిపిలో సీట్ల లొల్లి ... టికెట్ ఇవ్వకున్నా పోటీ చేస్తానంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే
అధికార వైసిపి తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాలో తనను కాదని మరొకరిని ఇంచార్జీగా ప్రకటించడంపై తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి సీరియస్ అయ్యారు. వెంటనే తన అనుచరులు, సన్నిహితులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
తిరువూరు : ఎన్నికలక సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపిలో ఇంచార్జీల నియామకం అలజడి రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కనబెడుతూ ఆ పార్టీ అధినేత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు... దీంతో మరోసారి అవకాశం దక్కనివారి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఇతరపార్టీలవైపు చూడగా తాజాగా ఆ జాబితాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే చేరేటట్లు కనిపిస్తోంది.
అధికార వైసిపి తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాలో చాలామంది సిట్టింగ్ లను పక్కనబెట్టారు. ఇలా తిరువూరు నియోజకవర్గ ఇంచార్జీగా ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణ నిధిని కాదని స్వామి దాస్ ను నియమించారు. దీంతో తీవ్ర అసహానికి గురయిన రక్షణనిధి పార్టీకి దూరంగా వుండననున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన టిడిపిలో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు.
వైసిపి అధిష్టానం మరోసారి తిరువూరు సీటు ఇవ్వకపోవడం తన మనసు ఎంతో గాయపర్చిందని ఎమ్మెల్యే రక్షణ నిధి అన్నారు. ఓ ఎంపీ చెప్పిన మాట విని తనను పక్కనబెట్టారని... గతకొంత కాలంగా తనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయని అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారమే తనకు తిరువూరు టికెట్ రాకుండా చేసారని అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు పార్టీని బలోపేతం చేసిన తనను గుర్తించకుండా ఎంపీ మాటలు విని సీటు ఇవ్వలేదని రక్షణనిధి అన్నారు.
Also Read పవన్ కళ్యాణ్‌తో బాలశౌరి భేటీ: జనసేనలో చేరికపై చర్చ
ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని... అయితే ఎక్కడినుండి చేయనున్నానో త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. అలాగే తన భవిష్యత్ రాజకీయాల గురించి సన్నిహితులు, లీడర్లు, క్యాడర్ తో చర్చించి రెండ్రోజుల్లో ప్రకటిస్తానని రక్షణనిధి తెలిపారు.
తన పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దూషించలేదని వైసిపి ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. తనకు టికెట్ దక్కకపోవడానికి ఇదికూడా ఓ కారణం కావచ్చంటూ వైసిపి అదిష్టానానికి చురకలు అంటించేలా కామెంట్స్ చేసారు. నియోజకవర్గ అభివృద్ది, పార్టీని బలోపేతం చేయడంకంటే ప్రత్యర్థులను తిట్టినవారికే వైసిపిలో టికెట్లు దక్కుతున్నాయి అనేలా రక్షణనిధి వ్యాఖ్యలు చేసారు.
గత కొంతకాలంగా వైసిపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో తనకు ముందుగానే అనుమానం వచ్చిందని రక్షణనిధి అన్నారు. అందువల్లే నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యాక్రమాలకు దూరంగా వున్నానని అన్నారు. అనుకున్నట్లే తనకు సీటు రాకుండా చేసారు ... కాబట్టి ఇక తన రాజకీయ భవిష్యత్ తాను చూసుకుంటానని తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి తెలిపారు.