అమరావతి: టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ (కంప్రోటర్ అండ్ ఆడిటర్ జనరల్) తో ఆడిట్ చేయించాలని తీసుకొన్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వాగతించారు.  ఈ నిర్ణయం తీసుకొన్నందుకు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి సీఎం వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా  ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. 

చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్ తో అడిటింగ్ చేయించడంతో పాటు ఇక ముందు కూడ ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్ సబర్వాల్ తో కలిసి సుబ్రమణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

2020-21 నుండి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయాలని గత నెల 28వ తేదీన టీటీడీ పాలకవర్గం తీర్మానం చేసింది.2014 నుండి 2019 వరకు టీటీడీ నిధుల వ్యయాన్ని కాగ్ తో ఆడిటింగ్ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.