ఎన్నికల్లో తన ఓటమికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లే కారణమని ఆరోపించారు తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ .  బుధవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ఎన్నికలు అనైతికంగా జరిగాయని.. సామాన్య ప్రజలు సైతం అనుకుంటున్న వాస్తవమిదని సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతిలో చివరి రౌండ్ వరకు తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబరిచిందన్నారు.  

గెలిచించి మనమేనని.. పోస్టల్ బ్యాలెట్‌లో అధికారులు చేతివాటం చూపారని సుగుణమ్మ ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లు రీకౌంటింగ్ కోసం తాను కోర్టుకు వెళుతున్నట్లుగా తెలిపారు.

కేంద్రప్రభుత్వం పంపిన ఎన్నికల పరిశీలకుడు పోస్టల్ బ్యాలెట్ 12వ రౌండ్‌లో కూడా మనం 1700 ఓట్లతో మెజారిటీలో ఉన్నప్పుడు రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తోందని.. పోస్టల్ బ్యాలెట్‌ను తికమక పెట్టించారని ఆమె ఆరోపించారు.

ఫలితాల రోజు రాత్రి 7.59 గంటల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లను మేనేజ్ చేశారని... దాదాపు 700 ఓట్లకు పైగా పోస్టల్ బ్యాలెట్లను మార్చేశారన్నారు. మరోవైపు తిరుపతి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని ఆర్వో విజయరామరాజు స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతలతో పాటు సీసీ కెమెరాల ముందు లెక్కింపు జరిగిందని ఆయన తెలిపారు.