తిరుపతి: తిరుపతిలో టింబర్ డిపో యజమానిని బెదిరించిన కేసులో 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా తిరుపతి అర్బన్ ఎస్పీ మంగళవారం నాడు ప్రకటించారు.

కబ్జారాయుళ్లు ప్రైవేట్ ఆర్మీతో భూములను ఆక్రమించుకొంటున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తిరుపతిలో రోజు రోజుకు భూ దందాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయమై స్పందన కార్యక్రమంలో భూముల కబ్జాపై ఎస్పీకి పెద్ద ఎత్తున పిర్యాదులు వెల్లువెత్తాయి.

తిరుపతిలో భూ వివాదం కేసులో రమేష్ రెడ్డి సహా మరో 10 మందిని అరెస్ట్ చేసినట్టుగా  ఎస్పీ తెలిపారు. ఈ నెల 2వ తేదీన తిరుపతిలోని బాలాజీ టింబర్ డిపోపై కొందరు దాడి చేశారు. ఈ విషయమై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా 11 మందిని అరెస్ట్ చేశారు. 

భూముల విషయంలో  ఏవరైనా బెదిరింపులకు పాల్పడితే  ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకొంటామని ఎస్పీ ప్రకటించారు. ప్రజలు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.