జనసేన, బిజెపి తిరుపతి లోకసభ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ శుక్రవారంనాడు పవన్ కల్యాణ్ ను కలిశారు. తిరుపతి లోకసభకు బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఉప ఎన్నిక అనివార్యంగా మారిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: బిజెపి లోకసభ ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి రత్నప్రభ శుక్రవారం సాయంత్రం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను కలిశారు. బిజెపి, జనసేన మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

రత్నప్రభ బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి. హైదరాబాదులో రత్నప్రభ పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ సమావేశంలో జనసేన పీఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షడు సోము వీర్రాజు, బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ దియోధర్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. 

వైసీపీ పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోకసభకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ తరఫున గురుమూర్తి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు కాంగ్రెసు నుంచి చింతా మోహన్ పోటీ చేస్తున్నారు. 

తిరుపతి లోకసభ సీటును జనసేన ఆశించినప్పటికీ ఉభయ పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని బిజెపి ఎంపిక చేసింది. కర్ణాటక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేశారు.