చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు తిరుపతి వైద్యాధికారులు తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన పరీక్షలో మరోసారి ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్య సిబ్బంది. గురువారం మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకుని తదుపరి వైద్యసేవలు పొందనున్నారు. 

ఆగస్టు26న భూమన కరుణకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డిలకు కరోనా నిర్థారణ అయ్యింది. తిరుపతిలోని రుయా ఆసపత్రిలో చేరి చికిత్స పొందారు. తరువాత కోలుకుని ఇంటికి వచ్చారు. 

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గత కొంతకాలంగా తిరుపతిలో కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన  రోగుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆగస్్ 23 న నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. ఆ తరువాత రెండు రోజులకే భూమనకు, ఆయన కుమారుడికి కరోనా సోకడంతో చికిత్స తీసుకున్నారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వచ్చిన వ్యక్తికి రెండోసారి వైరస్ సోకలేదు. అలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు.. కానీ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రెండోసారి కరుణాకర్ రెడ్డికి పాజిటివ్ రావడంతో నియోజకవర్గంలో, అనుచరుల్లో, కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.