తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ఈజీగా సహాయం అందుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, జిల్లా పోలీసుల భక్తుల కోసం MAY I HELP YOU సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకూ ఏమిటీ సేవలు? ఎలా పొందవచ్చు? ఇక్కడ తెలుసుకుందాం.
Tirumala : భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం. ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ ఆలయానికి ప్రతిరోజు లక్షలాదిమంది వస్తుంటారు... కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే తెలుగు ప్రజలే కాదు వివిధ రాష్ట్రాలనుండి తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా టిటిడి, తిరుపతి జిల్లా పోలీసులు కలిసి వినూత్న సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు.
తిరుమలలో భక్తులకు పోలీసులు ఎల్లపుడూ అందుబాటులో ఉండేలా 'MAY I HELP YOU' సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంటే తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఆలయాలు, లడ్డు, లగేజ్ కౌంటర్లు, బస్టాండ్, అన్నదానసత్రం వంటి ప్రాంతాల్లో నిత్యం పోలీసులు ఉంటారు. పోలీస్ దుస్తులపై మే ఐ హెల్ప్ యూ అనే జాకెట్ ధరించి ఉండే వీరిని ఏదయినా సాయం కోసం సంప్రదించవచ్చు.
తిరుమలలో మీకు లా ఆండ్ ఆర్డర్ సమస్యే కాదు ఎలాంటి సాయమైనా ఈ మే ఐ హెల్ప్ యూ పోలీసుల సాయం పొందవచ్చని తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ సూచించారు. శ్రీవారి భక్తులకు ఈ పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. తిరుమలలో మీకు ఏదయినా సమస్య తలెత్తినా, ఎవరైనా ఇబ్బందిపెట్టినా, ఏదయినా మోసానికి గురయినా ఈ పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇక తిరుమలలో ఏ సాయం కావాలన్నా MAY I HELP YOU జాకెట్స్ ధరించిన సిబ్బందిని సంప్రదించవచ్చని పోలీసులు, టిటిడి అధికారులు చెబుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ :
వేసవి సెలవుల్లో సాధారణ రోజుల్లోనే తిరుమలకు భక్తులు పోటెత్తుతారు... అలాంటిది ఆదివారం సెలవురోజు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సొంత వాహనాల్లో భక్తులు తరలిరావడంతో ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగింది...అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేసారు.. వాహనాలకు మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలా వాహనాల తనిఖీలు ఎక్కువ సమయం తీసుకోవడం కూడా ట్రాఫిక్ జామ్ కు కారణం అవుతోంది. కొండపై కూడా అన్నిప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి.
శ్రీవారి దర్శనానికి కూడా చాలా సమయం పడుతోంది... వైకుంఠ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్ మెంట్స్ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి 15 నుండి 20 గంటల సమయం పడుతోంది. మండుటెండల వేళ భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది టిటిడి.
శనివారం కూడా తిరుమలలో రద్దీ అధికంగా ఉంది... మొత్తం 84 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 33 వేలమందికి పైగా తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చింది.


