చిరుత దాడికి గురైన బాలుడిని శ్రీవారే రక్షించారు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
గత నెలలో అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లుతుండగా చిరుత దాడికి గురైన బాలుడు కౌశిక్ 14 రోజుల చికిత్స అనంతరం పూర్తి సురక్షితంగా ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యాడు. శ్రీవారే కౌశిక్ ప్రాణాలు రక్షించాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
తిరుపతి: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లుతుండగా చిరుత దాడికి గురై గాయపడిన చిన్నారి కౌశిక్‌ను శ్రీవారే రక్షించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చిరుత దాడికి గురైన కౌశిక్‌ను వెంటనే హాస్పిటల్ తరలించారు. 14 రోజులపాటు చికిత్స అందించారు. చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఉన్న కౌశిక్‌ను చైర్మన్ సమక్షంలో వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు.
బాలుడిని డిశ్చార్జీ చేసిన సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. జూన్ 22వ తేదీన రాత్రి పూట చిన్నారి కౌశిక్ పై చిరుత దాడి చేసిందని, టీటీడీ అధికారులు వెంటనే స్పందించి బాలుడిని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హాస్పిటల్ తరలించారని వివరించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాలుడికి చికిత్స అందించారని, ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. దాడికి పాల్పడ్డ చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారని చెప్పారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.
Also Read: చంద్రబాబు నాయుడుపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన నిజాయితిని శంకించాల్సిందే?
గాయపడ్డ కౌశిక్ తల్లిదండ్రులు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బి. పులికొండ, బి. శిరీషలు. తమ బిడ్డ ప్రాణాలు దక్కడంపై వారు సంతోషించారు. తమ బిడ్డ ప్రాణాలను స్వామి కాపాడారని, ఆయనకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని వివరించారు. దాడి జరిగిన 15 నిమిషాల్లోనే టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు స్పాట్‌కు చేరుకున్నారని, తమ బిడ్డను హాస్పిటల్‌కు తరలించారని తెలిపారు. వైద్యులు ఉచితంగా చికిత్స అందించారని చెప్పారు.