విశాఖ ఏజెన్సీలో ఎన్కౌంటర్... భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోల మృతి
ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.
విశాఖపట్నం: ఆంధ్రా ఒడిషా సరిహద్దు(AOB)లోని ఏజెన్సీ ప్రాంతాలు మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఏపీలోని విశాఖపట్నం, ఒడిషాలోని మల్కన్ గిరి సరిహద్దుల్లో గల అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యాయి.
ఆంధ్రా-ఒడిషా సరిహద్దులోని మల్కన్ గిరి జిల్లా తులసిపహడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అయితే ఈ పేలుడు నుండి తృటితో తప్పించుకున్నా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇదే సమయంలో పోలీసులకు,మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ encounter లో ముగ్గురు మావోయిస్ట్ మృతిచెందినట్లు ఒడిషా డిజిపి ప్రకటించారు. మృతిచెందిన మావోయిస్టుల్లో AOB ఎస్ జెడ్ సీ మల్కన్ గిరి - కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలు వున్నట్లు ప్రాధమికంగా నిర్ధారణ అయినట్లు ఒడిషా డిజిపి తెలిపారు. అయితే మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
మావోలు అమర్చిన మందుపాతర పేలడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఒజీ జవాన్లను హెలికాప్టర్ లో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇక మావోయిస్టుల కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది. తులసిపహడ్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు భద్రతా బలగాలు. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో విశాఖపట్నంలోని ఏజెన్సి ప్రాంతాలు పోలీసలు కూడా అప్రమత్తమయ్యారు. ఒడిషా బార్డర్ లో భద్రతా బలగాలను మోహరించారు.