తెరపైకి మూడు రాజధానులు: అమరావతి ఉద్యమానికి 1500 రోజులు, కారణమిదీ....
మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 1500 రోజులకు చేరుకున్నాయి.
అమరావతి: అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం గురువారానికి 1500 రోజులకు చేరింది. మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి జేఏసీ ఈ ఉద్యమం కొనసాగిస్తుంది.
అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో 34,322 ఎకరాల భూమిని 29,881 రైతుల నుండి భూ సమీకరణ కింద తెలుగు దేశం ప్రభుత్వం సేకరించింది. అమరావతి రాజధాని పేరుతో తెలుగు దేశం పార్టీ నేతలు, చంద్రబాబు సన్నిహితులు భూములను కొనుగోలు చేశారని వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేసింది. ఈ విషయమై హౌస్ కమిటీని కూడ ఏర్పాటు చేసింది జగన్ సర్కార్.ఈ విషయమై విచారణ నిర్వహించిన హౌస్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వైఎస్ఆర్‌సీపీ సర్కార్ ఆరోపణలపై చంద్రబాబు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి జగన్ సర్కార్ ఒక్క ఆధారాన్ని కూడ సేకరించలేకపోయిందని ఆయన గతంలోనే పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్ సీపీ)పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 డిసెంబర్ 17న మూడు రాజధానుల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెరమీదికి తీసుకు వచ్చారు. విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, అమరావతిలో శాసనరాజధాని అంశం తెరమీదికి వచ్చింది. ఈ విషయమై ప్రభుత్వం వేసిన కమిటీ అధ్యయనం చేసి రిపోర్టు ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడానికి మూడు రాజధానులను తెరమీదికి తెచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ అమరావతి రైతులు జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం ఇవాళ్టికి 1500 రోజులకు చేరుకుంది. అమరావతి వేదికగా ఆందోళనలు, పోరాటాలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడ రైతులు పిటిషన్లు దాఖలు చేశారు.
మూడు రాజధానులపై అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసిన రోజు నుండి అమరావతి రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ ఆందోళనలకు వైఎస్ఆర్‌సీపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి.
also read:న్యాయ పోరాటం చేసుకోవచ్చు: రాజీనామా ఆమోదంపై గంటాకు తమ్మినేని సూచన
మూడు రాజధానులకు అనుకూలంగా వైఎస్ఆర్‌సీపీ కూడ పోటీ ఉద్యమాలు ప్రారంభించింది. విశాఖపట్టణంలో పరిపాలన రాజధానికి అనుకూలంగా ఉద్యమాలు సాగాయి.2020 జనవరి 20న చలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. అసెంబ్లీ సమీపంలోకి వచ్చిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.2021 మార్చి 8న కనకదుర్గ టెంపుల్ కు వెళ్తున్న అమరావతి జేఏసీ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జీకి పాల్పడ్డారు.
2021 నవంబర్ 1న రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర నిర్వహించారు.57 రోజుల పాటు పాదయాత్ర సాగింది. తిరుపతిలో ఈ యాత్ర ముగిసింది. ఈ యాత్ర ముగింపును పురస్కరించుకొని తిరుపతిలో సభ నిర్వహించారు.
also read:జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు: ఈసీ స్పష్టీకరణ
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని జేఏసీ ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సుమారు ఏడు వందలకు పైగా కేసులు నమోదైనట్టుగా అమరావతి జేఏసీ నేతలు చెబుతున్నారు. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో కొందరు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. అనేక అడ్డంకులు, కేసులు, ఆందోళనలు, లాఠీచార్జీలు సాగినా జేఏసీ ఆందోళనలు సాగిస్తుంది.
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రాగానే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చంద్రబాబు ఇటీవలనే ప్రకటించారు. బోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రజా వ్యతిరేక జీవోలను బోగి మంటల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దగ్దం చేశారు.ఈ సందర్భంగా అమరావతి రాజధాని అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళ్తుంది. విశాఖపట్టణం నుండి పాలన సాగిస్తామని జగన్ పలు దఫాలు ప్రకటించారు. ఈ విషయమై ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.