రాయచోటి: హత్య చేసి పాము కాటుగా చిత్రీకరించి తప్పించుకొనేందుకు ప్రయత్నించారు నిందితులు. 20 రోజుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీ సహాయంతో వెంకటరమణ హత్య కేసును పోలీసులు చేధించారు.

కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో వంగిపురం హరిజనవాడకు చెందిన  వెంకటరమణ ఈ ఏడాది జూన్ 25న హత్యకు గురయ్యాడు.వెంకటరమణను అదే గ్రామానికి చెందిన మల్లికార్జుననాయుడు, రామ్మోహన్ నాయుడు పథకం ప్రకారం పొలం వద్దకు సారా తయారు చేయడానికి తీసుకెళ్లారు. 

అయితే అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న శ్రీరాములు రెడ్డి, బాస్కర్, విజయ్ కుమార్ అలియాస్ కిరణ్ మద్యం తాగించారు. ఎలాంటి గాయాలు లేకుండా హతమార్చారు.వెంకటరమణ పాముకాటుకు గురై మరణించారని  మృతదేహాన్ని  అక్కడే వదిలేశారు.దీంతో ఈ కేసు విషయమై  వీరబల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

టెక్నాలజీ సహాయంతో వెంకటరమణ హత్యకు గురైనట్టుగా పోలీసులు గుర్తించారు.  మల్లిఖార్జుననాయుడు, భాస్కర్, విజయకుమార్ అలియాస్  కిరణ్ కు అరెస్ట్ చేసినట్టుగా పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ చెప్పారు.

గ్రామ తగాదాలు, వివాహేతర సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని వెంకటరమణను హత్య చేశారని  ఆయన తెలిపారు. ఈ కేసును 20 రోజుల్లో చేధించిన ట్రైనీ డీఎస్పీ ప్రసాద్ రావు, గ్రామీణ సీఐ లింగప్ప, ఎస్ఐ రామాంజనేయులును ఆయన అభినందించారు.