Asianet News TeluguAsianet News Telugu

క్రైమ్ రౌండప్: రేప్ కేసులో స్వామి చిన్మయానంద అరెస్ట్, మరిన్ని వార్తలు

అత్యాచారం కేసులో స్వామి చిన్మయానంద అరెస్టవ్వడం గత వారం జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మరోవైపు సినిమాలలో అవకాశాల పేరుతో ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీటిలో పాటు మరిన్ని క్రైమ్ వార్తలు మీకోసం.

this week crime roundup
Author
Hyderabad, First Published Sep 22, 2019, 2:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అత్యాచారం కేసులో స్వామి చిన్మయానంద అరెస్టవ్వడం గత వారం జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మరోవైపు సినిమాలలో అవకాశాల పేరుతో ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీటిలో పాటు మరిన్ని క్రైమ్ వార్తలు మీకోసం.

చిన్మయానంద అరెస్ట్:
విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీని విధించింది.

స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసి దాని సాయంతో స్వామిజీ బెదిరింపులకు పాల్పడి.. తనపై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ న్యాయ విద్యార్ధిని ఆరోపణలు చేశారు.

ఆ తర్వాతి నుంచి సదరు యువతి ఆచూకీ లేకుండా పోయారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గత నెలలో పోలీసులు చిన్మయానందపై కిడ్నాప్, వేధింపుల కింద కేసు నమోదు చేశారు.

ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన యూపీ పోలీస్ శాఖ బాధితురాలు ఇచ్చిన ఆధారాల ఆధారంగా చిన్మయానందను అదుపులోకి తీసుకుంది.

ఆ యువతి ఇచ్చిన పెన్‌డ్రైవ్‌లో 43 వీడియోలు ఉన్నట్లు సమాచారం. భారీ బందోబస్తు మధ్య శనివారం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. 

పాతకక్షల కారణంగా సొంత బంధువుల కిరాతకం

పాతకక్షల నేపథ్యంలో సొంతబంధువులు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌కు చెందిన జక్కుల కిషన్ భార్య గతంలో చనిపోయింది.

ఆయనకు ఇంటర్ చదువుతున్న కుమార్తె మీనాక్షి, కుమారుడు అరుణ్ ఉన్నారు. కూలీ పనులను వెళ్తున్న కిషన్ పిల్లలను చదివించుకుంటున్నాడు. అయితే ఆయనకు పొల్కంపల్లి, మాన్యగూడ, నెర్రపల్లిలో ఉంటున్న బంధువులతో పాతకక్షలు ఉన్నాయి.

ఈ నెల 31న బంధువుల వద్దకు వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన కిషన్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆయన కుమార్తె మీనాక్షి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు... కిషన్ కాల్‌డేటా ఆధారంగా కేసును ఛేదించారు. మాన్యగూడకు చెందిన గునుకుల ఐలయ్య .... గతంలోనే పాతకక్షలతో కిషన్‌ను హత్య చేసినట్లు తేల్చారు.

ఈ క్రమంలో గత నెల 31న కిషన్ నెర్రపల్లికి వచ్చాడని తెలుసుకున్న ఐలయ్య తన కుమారులు సురేష్, నరేశ్ అల్లుడు కృష్ణతో పాటు నెర్రపల్లికి చెందిన బంధువులు శేఖర్, శ్రీశైలం, నరేశ్‌తో కలిసి పథకం పన్నాడు.

నెర్రపల్లికి వచ్చిన సందర్భంలో మాన్యగూడకు రావాలని కోరారు. దీంతో స్కూటర్‌పై రాత్రి అక్కడికి బయల్దేరిన కిషన్‌ను మాటు వేసి గొడ్డళ్లు, కొడవళ్లు, కర్రలతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చారు.

అనంతరం రాయపోల్ గ్రామంలోని ఓ కందకంలో మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత రోజు మళ్లీ వచ్చి మట్టితో ఆ ప్రదేశాన్ని కప్పేసినట్లు ఐలయ్య పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు నిందితుడిని తీసుకుని ఘటనా స్థలిలో కిషన్ మృతదేహాన్ని వెలికితీశారు.

చనిపోయి 20 రోజులు కావడం, తగులబెట్టి, పూడ్చివేయడంతో కిషన్ అస్థిపంజరం మాత్రమే మిగిలింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కిషన్ హత్య కేసులో సంబంధమున్న ఏడుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సినిమా ఛాన్స్ పేరుతో యువతిపై గ్యాంగ్‌రేప్

సినిమా ఛాన్సులు ఇప్పిస్తామంటూ ఓ యువతిపై ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నగరంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన మక్కల సురేశ్ ఓ యువతిని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి రెండు సార్లు అత్యాచారం చేశాడు.

అనంతరం తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. ఆటోలో వచ్చిన ఆరుగురు యువకులు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడి చేశారు. దీనిని మరో ఇద్దరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

అయితే ఓ కేసు నిమిత్తం అటుగా వెళ్తోన్న ఎస్ఐ, కానిస్టేబుల్‌లకు నిర్మానుష్య ప్రదేశంలో ఆటో కనిపించడంతో వారికి అనుమానం కలిగింది. అక్కడికి వెళ్లి చూడగా.. ఆటోలో కూర్చొని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఇద్దరు యువకులు కనిపించారు.

వారిని పోలీసులు ప్రశ్నించగా... తాము ఏడుగురు స్నేహితులం బహిర్భూమికి వచ్చామంటూ బుకాయించారు. పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించి.. స్పీకర్ ఫోన్ ఆన్ చేయించడంతో యువతి అరుపులు వినిపించాయి. వెంటనే వీరిద్దరిని అదుపులోకి తీసుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు.

అఘాయిత్యానికి పాల్పడిన నిందితులకు గతంలో నేర చరిత్ర ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిపై నాగరాజు అనే నిందితుడు లైంగికదాడికి యత్నించాడు. మిగిలిన వారిపైనా 6వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు తెలిపారు.


గన్నవరంలో కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

కృష్ణాజిల్లా గన్నవరంలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. అప్పు తీర్చలేదనే కారణంతో 8 నెలల బాలుడు అకీస్‌ని చాంద్, షహనాజ్ అపహరించారని పోలీసులు మీడియాకు తెలిపారు.

రాజస్థాన్‌కు చెందిన పూలుభాయ్ ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పు విషయంలో చాంద్, పూలుభాయ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చాంద్.. పూలుభాయ్ కుమారుడు అకీస్‌ని చాంద్, షహనాజ్ కలిసి కిడ్నాప్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులు రైల్లో పారిపోతున్నట్లుగా గుర్తించి.. ముందుగానే జైపూర్‌కు చేరుకుని, స్థానిక పోలీసులు సాయంతో పట్టుకున్నారు. 


వ్యక్తి మర్మాంగాన్ని కోసెసిన అత్తింటివారు

భార్యను కాపురానికి తీసుకెళ్లడం కోసం అత్తారింటికి వెళ్లిన ఓ యువకుడి మర్మాంగాన్ని కత్తిరించి కారంపొడితో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పాణ్యం మండలం ఎస్ కొట్టాల గ్రామానికి చెందిన యూనస్‌కు గడివేముల మండలం సోమాపురం గ్రామానికి చెందిన హసీనాతో రెండేళ్ల క్రితం వివాహమైంది.

అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె తరచూ పుట్టింటికి వెళ్లేది. ఈ క్రమంలో బక్రీద్ పండగరోజు పుట్టింటికి వెళ్లిన హసీనా మళ్లీ తిరిగి రాలేదు. దీంతో బుధవారం రాత్రి పోలీసులు యూనస్‌ని తీసుకుని సోమాపురం వెళ్లాడు.

అక్కడ హసీనాను కాపురానికి పంపించాలంటూ పోలీసులు సూచించి వెళ్లిపోయారు. రాత్రి అత్తారింట్లోనే పడుకున్న యూనస్ కాళ్లు, చేతులను హసీనా ఆమె సోదరుడు కట్టివేశారు.

అనంతరం హసీనా కత్తెరతో భర్త మర్మాంగాన్ని కత్తిరించగా.. ఆమె సోదరుడు నోరు మూశాడు. యూనస్ ప్రతిఘటించడంతో హసీనా సోదరుడు రోకలి బండతో మోదాడు.

అపస్మారక స్థితిలో ఉన్న అతనిపై కారం చల్లి దాడి చేశారు. తెల్లవారుజామున స్పృహలోకి వచ్చిన యూనస్ చేతులు,కాళ్లకు ఉన్న కట్లు ఊడదీసుకుని తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం తెలిపాడు.

అనంతరం అతనిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios