రుషికొండ భవనాలపై వైసీపీ ఫస్ట్ రియాక్షన్ ఇదే
విశాఖ రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల లోపల ఏముందో తెలిసిపోయింది. రూ.లక్షల విలువైన బాత్ టబ్ లు, ఖరీదైన ఫర్నీచర్, రాజప్రాసాదాలను తలపించే విలాసవంతైన గదులు వెలుగు చూశాయి. దీంతో ఈ భవనాలపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. ఎందుకంటే..?
ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న రుషికొండ భవనాల దృశ్యాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ నాయకులతో కలిసి రుషికొండ భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రాండ్‌గా చేపట్టిన భవన నిర్మాణాలు, కళ్లు చెదిరిపోయే సెట్టింగులు, విలాసవంతమైన గదులు, పెద్ద పెద్ద బాత్ టబ్‌లు, జిగేల్‌మనే లైటింగ్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలన్నీ బయటకు వచ్చాయి. అవి సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానెళ్లలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
దాదాపు రూ.500కోట్లతో నిర్మించిన ఈ భవనాల వైపు ఎవరినీ వెళ్లనీయకుండా ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. కనీసం ప్రారంభోత్సవాన్ని ఎంతో రహస్యంగా నిర్వహించారు. మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలను, స్వామీజీలను మాత్రమే ప్రారంభోత్సవం రోజు రుషికొండ పైకి అనుమతించారు. చివరికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. తాజాగా రుషికొండ భవనంలోని విలాసవంతమైన గదులు, ఖరీదైన సామాగ్రి, ఫర్నిచర్ అంతా ప్రజలకు తెలిసిపోయింది.
దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ.. ‘‘రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే.. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..!’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘‘రుషికొండ ప్యాలెస్ లో వాడిన ఇటాలియన్ మార్బుల్, టైల్స్ చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఈ ఇటాలియన్ మార్బుల్స్ కోసం ఒక్కో అడుగుకి పెట్టిన ఖర్చుతో, మధ్య తరగతి ప్రజలు, ఒక చిన్న సైజ్ అపార్ట్ మెంట్ కొనేయొచ్చు.’’
‘‘దేశాధినేతలు కట్టుకునే రాజప్రాసాదాలకు వాడే మెటీరియల్‌తో, జగన్ రెడ్డి రుషికొండలో కట్టుకున్న బీచ్ వ్యూ ప్యాలెస్ ఇది. భార్య కోరిక కోసం, కొండని కొట్టి మరీ, ఈశాన్యంలో సముద్రం ఉండేలా, బీచ్ వ్యూ తో రూ.500 కోట్లతో ప్యాలెస్. బాత్ టబ్ ఒక్కటే రూ.26 లక్షలు.
మళ్ళీ పేదలు, పెత్తందార్లు అని జోకులు వేస్తూ, పేదలకు ఇళ్లు కూడా లేకుండా చేసాడు.’’ అంటూ ఇలా వరుసగా పోస్టులు చేసింది టీడీపీ.
దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది..
‘‘రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!’’ అని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.