ఈ వర్షానికే పరిస్ధితి ఇలాగుంటే ఇక రాబోయే వర్షాకాలంలో ఒక్క భారీ వర్షం పడితే ఇక చెప్పాల్సిన పనేలేదు. సిఎం బ్లాకులోకి కూడా నీరు చేరటంతో పాటు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలోకి కూడా భారీగా కురుస్తోంది.

పేరు గొప్ప...ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పరిస్ధితి. పేరుకేమో ఖరీదైన నిర్మాణాలు. నాణ్యతేమో నాసిరకం. ఇంతోటి దానికి రికార్డు టైంలో నిర్మించారంటూ ఎల్ అండ్ టి, షపూర్ జీ పల్లోంజి సంస్ధలకు కితాబులు మళ్ళీ.

ఇంతోటి నాసిరకం కట్టడాలకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం సుమారు రూ. 800 కోట్లు వ్యయం చేసింది. చినుకుపడితే చాలు మొత్తం చిత్తడే. గట్టి వర్షం పడితే చాలు బ్లాకుల్లోకి నీరు చేరటమే. అది మన ఘనత వహించిన నారా వారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో, శరవేగంగా నిర్మించిన వెలగపూడి సచివాలయ పరిస్ధితి. మొత్తం ఆరు బ్లాకుల్లోనూ వర్షాలకు లీకేజీలే.

ఈరోజు మధ్యాహ్నం నుండి కురుస్తున్న భారీ వర్షానికి తాత్కలిక సచివాలయం పలుచోట్ల కురుస్తోంది. అసెంబ్లీ, సచివాలయంలోని పలు ఛాంబర్లు నీటితో నిండిపోయాయి. సిబ్బంది బకెట్లు పట్టుకుని తోడుతున్నారు. ఒక్కసారిగా వర్షపు నీరు విభాగాల్లోకి చేరుతుండటంతో సిబ్బందికి విధి నిర్వహణ ఇబ్బందిగా తయారైంది.

ఈ వర్షానికే పరిస్ధితి ఇలాగుంటే ఇక రాబోయే వర్షాకాలంలో ఒక్క భారీ వర్షం పడితే ఇక చెప్పాల్సిన పనేలేదు. సిఎం బ్లాకులోకి కూడా నీరు చేరటంతో పాటు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలోకి కూడా భారీగా కురుస్తోంది. బ్లాకుల్లోకి నీరు చేరటాన్ని ఫోటోలు తీయాలని మీడియా ప్రయత్నించారు. అయితే, ఫొటోలు, వీడియోలు తీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవటం కొసమెరుపు.