తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో అనుభవం లేని ఓ దొంగ మొదటిసారి చోరీకి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. దొంగతనం కోసం ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ నిద్ర ముంచుకురావడంతో కాస్సేపు కునుకు తీయాలనుకుని గాడ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇలా వచ్చిన పని మరిచి గురకలు కొడుతూ మరీ నిద్రించిన దొంగ చివరకు ఇంట్లోవాళ్లకు దొరికి జైలుపాలయ్యాడు. 

గోకవరంలో సత్తి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ బంక్ నిర్వహకుడు. అతడు గత శుక్రవారం రాత్రి బంక్ లో వసూలయిన డబ్బులను ఓ బ్యాగులో పెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇలా డబ్బును తీసుకెళ్లడాన్ని గమనించిన ఓ వ్యక్తి అతన్ని ఫాలో అయ్యాడు. ఎలాగోలా వెంకట్ రెడ్డి ఇంట్లోకి చేరుకుని మంచం కింద దాక్కున్నాడు. ఇంట్లో అందరూ పడుకున్నాక డబ్బుల బ్యాగ్  తీసుకుని వెళ్లిపోదామని భావించాడు. 

read more   కరోనా బాధిత యువతిపై... క్వారంటైన్ కేంద్ర సిబ్బంది అత్యాచారయత్నం

అయితే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన లెక్కలు చూస్తూ వెంకట్ రెడ్డి అర్థరాత్రి ఒంటిగంట వరకు మెలకువగా వున్నాడు. దీంతో మంచం కింద నక్కిన సదరు దొంగ నిద్రలోకి జారుకున్నాడు. ఇలా గురకపెడుతూ మరీ పడుకున్న అతడిని గుర్తించిన ఇంట్లోని వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సదరు గురక దొంగను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

విచిత్రం ఏంటంటే ఇలా దొంగతనానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన వ్యక్తి వెంకట్ రెడ్డికి బాగా తెలిసిన వ్యక్తి  కావడం. అత్యవసరంగా డబ్బులు అవసరం కావడంతో మొదటిసారి దొంగతనానికి ప్రయత్నించానని సదరు దొంగ పోలీసులకు తెలిపాడు.