ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష చేపట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కనబరిచిన పనితీరు, వారి దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి సంబంధించి డేటాను ఈ సందర్భంగా ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నెల 7నుంచి ప్రారంభించనున్న ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. గృహ సారథులపై పార్టీ శ్రేణులతో సీఎం జగన్ చర్చించారు. 

అయితే ఈ కీలక సమావేశానికి ఇద్దరు మంత్రులతో పాటు కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి‌లు సమావేశానికి హాజరుకాలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరంతా వ్యక్తిగత కారణాలతోనే సమావేశానికి హాజరు కాలేదని వారి వర్గాలు చెబుతున్నాయి. 

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోవిడ్ బారిన పడగా.. ధర్మాన ప్రసాదరావు స్థానిక కార్యక్రమాల వల్ల హాజరుకాలేదని చెబుతున్నారు. అయితే ఇది సీఎం జగన్ నిర్వహిస్తున్న కీలక సమావేశం కావడంతో.. కొందరు నేతలు హాజరుకాకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.