15 రోజుల గడువు: కర్ణాటకలో యడ్యూరప్ప వ్యూహం ఇదీ...

15 రోజుల గడువు: కర్ణాటకలో యడ్యూరప్ప వ్యూహం ఇదీ...

బెంగళూరు: సాధారణ మెజారిటీకి కర్ణాటకలో బిజెపికి 8 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానించారు. అది అలా జరుగుతుందని అందరూ ఉహించిందే.

కాంగ్రెసు, జెడి(ఎస్) కూటమికి 116 మంది సభ్యులు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్రులు కూడా కాంగ్రెసు వైపు చేరారు. దీంతో కాంగ్రెసు, జెడి(ఎస్) కూటమి వైపు 118 సభ్యులున్నారు. వారిని కాపాడుకోవడం కాంగ్రెసు, జెడి(ఎస్)లకు పెద్ద సవాల్. 

యడ్యూరప్ప బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చారు. ఒక్క రకంగా ఆయనకు ఎక్కువ సమయం ఇచ్చినట్లే. 15 రోజుల్లోగా కాంగ్రెసు, జెడి(ఎస్) సభ్యులను కొంత మందిని తిప్పుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. 

సాధారణ మెజారిటీ ఇప్పుడైతే 112. రెండు చోట్ల గెలిచిన జెడి(ఎస్) నేత ఓ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దాంతో శాసనసభ్యుల సంఖ్య 221కి పడిపోతుంది. అప్పుడు సాధారణ మెజారిటీ 111 అవుతుంది. 

కాంగ్రెసు, జెడి(ఎస్)లను చీల్చే వ్యూహం ఒక్కటైతే, బిజెపికి మరో వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, జెడి(ఎస్)లకు చెందిన కొంత మంది శాసనసభ్యులు బలనిరూపణ రోజు శాసనసభకు గైర్హాజరయ్యేలా చూసిన గట్టెక్కడానికి వీలవుతుంది. 

తాత్కాలికంగా గట్టెక్కిన తర్వాత మరో ఆరు నెలల వరకు యడ్యూరప్పకు ఢోకా ఉండదు. అప్పటికి ఏమైనా జరగవచ్చు. మొత్తం మీద, కాంగ్రెసు, జెడి(ఎస్) శాసనసభ్యుల మీదనే యడ్యూరప్ప పూర్తిగా ఆధారపడ్డారని చెప్పవచ్చు. 

మే 17వ తేదీన తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన మాటను మాత్రం యడ్యూరప్ప నిలబెట్టుకున్నారు. ఫలితాలు రాక ముందే ఆయన ఆ ప్రకటన చేయడాన్ని కొందరు ఎద్దేవా చేశారు. ఆయనకు మతి భ్రమించిందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. జ్యోతిష్కులను సంప్రదించి యడ్యూరప్ప ముహూర్తాన్ని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page