బ్రాహ్మణ కార్పరేషన్ ఛైర్మన్ గా ఐవైఆర్ ను తొలగించినప్పటి నుండి ఆయనకు ప్రభుత్వం మీద ఇంకా చెప్పాలంటే చంద్రబాబునాయుడు మీదున్న మంట స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయితే, ఆమంటను ఎలా తగ్గించుకోవాలో ఆయనకు అర్ధం కావటం లేదు. అందుకే అప్పుడప్పుడు రాజధాని-అమరావతి అంటూ మీడియా ముందుకొస్తున్నారు. ఆయన మనసులోని మాటను చెప్పటానికి భయపడుతున్నారన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రధానకార్యదర్శిగా ఉన్నపుడు తాను ముక్కుసూటిగా పనిచేసానని, రాజధాని నిర్మాణానికి చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలను తాను అడ్డుకున్నానని చెప్పుకోవాలన్న తాపత్రయం మాత్రం ఆయన మాటల్లో కనబడుతోంది.
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారశైలి విచిత్రంగా ఉంటోంది. బ్రాహ్మణ కార్పరేషన్ ఛైర్మన్ గా ఐవైఆర్ ను తొలగించినప్పటి నుండి ఆయనకు ప్రభుత్వం మీద ఇంకా చెప్పాలంటే చంద్రబాబునాయుడు మీదున్న మంట స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయితే, ఆమంటను ఎలా తగ్గించుకోవాలో ఆయనకు అర్ధం కావటం లేదు.
అందుకే అప్పుడప్పుడు రాజధాని-అమరావతి అంటూ మీడియా ముందుకొస్తున్నారు. గురువారం విజయవాడలో జరిగింది కుడా అదే. అమరావతిపై ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతారంటూ గ్రీన్ సోల్జర్స్ పేరుతో మీడియాకు ఆహ్వానం అందింది. కృష్ణారావు ఏమి మాట్లాడుతారో చూద్దామని అనుకుంటే అంతా పాత చింతకాయపచ్చడేనని తేలిపోయింది.
పైగా ఆయన మనసులోని మాటను చెప్పటానికి భయపడుతున్నారన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఏదో చెప్పాలని, ఏమీ చెప్పలేక ప్రధానకార్యదర్శిగా ఉన్నపుడు తాను ముక్కుసూటిగా పనిచేసానని, రాజధాని నిర్మాణానికి చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలను తాను అడ్డుకున్నానని చెప్పుకోవాలన్న తాపత్రయం మాత్రం ఆయన మాటల్లో కనబడుతోంది. ఇంతకీ ఈరోజు ఐవైఆర్ చెప్పదలుచుకున్న విషయంలో మాత్రం స్పష్టత లోపించింది.
ఎందుకంటే, తాజాగా ప్రస్తావించిన అంశాలన్నీ గతంలో చెప్పేసినవే. పైగా ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నపుడు ప్రభుత్వం ఏం చెబితే అది చేయటమే తన బాధ్యతగా చెప్పుకున్నారు. సలహాను స్వీకరించే ఉద్దేశ్యం ఉన్నపుడే ఎవరైనా స్వీకరిస్తారని, అడగనిదే సలహా ఇవ్వకూడదని, ఆ రోజుల్లో తానేం చేసానో అధికారిక రహస్యాల క్రిందకు వస్తుందని చెప్పటం గమనార్హం.
ఇక్కడ, ఐవైఆర్ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రాజకీయ నేతలు ఏమి చెబితే అది చేయటానికి కాదు ఐఏఎస్ వ్యవస్ధ ఉన్నది. తప్పును తప్పుగా చెప్పగలిగినపుడే ఆయన చదివిన ఐఏఎస్ చదువుకు సార్దకత. నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నపుడు కచ్చితంగా తప్పని చెప్పటం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ బాధ్యత. మరి, ఆ రోజుల్లో ఆ పని చేసింది లేనిదీ చెప్పటం లేదు. ఒకవేళ చెప్పకపోతే ఎక్కడ ప్రధాన కార్యదర్శిగా తీసేస్తారో అన్న స్వార్దమే ఆయనతో చెప్పించలేకపోయిందేమో. అంటే పదవులను కాపాడుకోవటం కోసం ఐవైఆర్ మౌనంగా ఉండిపోయారని అనుకోవాలి.
నమ్మిన సిద్ధాంతాల కోసం నిబందనలను ఉల్లంఘించటం ఇష్టం లేక పాలకుల నిర్ణయాలను ధైర్యంగా వ్యతిరేకించిన ఐఏఎస్ అధికారులను ఒకసారి ఐవైఆర్ గుర్తుకుతెచ్చుకోవాలి. పదవుల కోసం పాకులాడని ఐఏఎస్ అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో కుడా ఎంతో మందున్న విషయం కృష్ణారావుకు తెలీదా? రాజధాని నిర్మాణ ప్రక్రియలో లోపాలన్నాయని కృష్ణారావు ఇపుడు చెబుతుండటంలో కొత్తేమీ లేదు. జనాల నోళ్ళల్లో ఎప్పటి నుండో నానుతున్నదే.
ఈ విషయంలో ఐవైఆర్ కన్నా ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఇఏఎస్ శర్మే చాలా విషయాలు చెప్పారు. కొత్తగా ఐవైఆర్ ఏమన్నా చెప్పదలచుకుంటే చెప్పాలి. అంతేకానీ పాతచింతకాయ పచ్చడి గురించి కృష్ణారావు పదే పదే చెప్పటంలో అర్దం లేదు.
