కళ్లముందే కొడుకు చనిపోగా కన్నతల్లే అన్నీతానే అంత్యక్రియలు నిర్వహించింది. చివరకు తలకొరివి కూడా ఆ తల్లే పెట్టింది.
విజయవాడ : కన్న కొడుకుకు తల్లి తలకొరివి పెట్టిన హృదయవిదారక ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో కొడుకు చనిపోగా వృద్దురాలైన ఆ తల్లి కన్నీటిని దిగమింగుకుంటూ అన్నీ తానయి అంత్యక్రియలు నిర్వహించింది. ఏ చేతుల్లో అయితే పెరిగాడో అదే చేతులతో కొడుకుకు తలకొరివి పెట్టాల్సి వచ్చిందంటే ఆ తల్లి మనోవేదన ఎలా వుంటుందో మాటల్లో చెప్పలేం. కొడుకుకు తలకొరివి పెడుతూ ఆ తల్లి పడిన ఆవేదన చూసేవారికి కన్నీరు తెప్పించింది.
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామానికి చెందిన పామర్తి ప్రసాద్ కు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఇటీవల అతడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో బ్రతికించుకోడానికి ఆ కుటుంబం లక్షలు ఖర్చుచేసుకుని హాస్పిటల్స్ కు తిప్పారు. అయినా ఫలితం లేకుండా అతడు మరణించాడు. అయితే అతడికి కొడుకులు లేకపోవడంతో కన్నతల్లే తలకొరివి పెట్టింది.
Read More గుంటూరులో ఘోరం... రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం
కొడుకు ప్రసాద్ మృతదేహం వద్ద వృద్దురాలు పామర్తి ఝాన్సీ కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది. తనకు తలకొరివి పెట్టాల్సిన వాడికి తానే తలకొరివి పెట్టాల్సి వస్తోందంటూ ఆ తల్లి కన్నీరు పెట్టుకుంది. అన్నీ తానే అయి కొడుకు అంత్యక్రియలు నిర్వహించి ఆ తల్లే తలకొరివి పెట్టింది. బంధువులు, గ్రామస్తులు ఎంత ఓదార్చినా ఈ వయసులో కొడుకును కోల్పోయిన ఆ తల్లి బాధ ఇప్పట్లో తగ్గేది కాదు.
