భర్తతో కలిసి హాస్పిటల్ కు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయి నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది.  

గుంటూరు : తొమ్మిది నెలల నిండు గర్భిణి హాస్పిటల్ కు వెళుతూ ప్రమాదవశాత్తు మృతిచెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. భర్తతో కలిసి బైక్ పై హాస్పిటల్ కు వెళుతుండగా వెనకనుండి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై తీవ్ర గాయాలతో పడిపోయిన గర్భిణి హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. కడుపులోని బిడ్డతో సహా తల్లి మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 

గుంటూరు జిల్లా కాకుమాను మండలం పాండ్రపాడు గ్రామానికి చెందిన దేవిరెడ్డి వాణి(24) నిండు గర్భిణి. 9 నెలల గర్భంతో వున్న వాణి ప్రసవానికి ముందు స్కానింగ్ తీయించుకోడానికి పొన్నూరు బయలుదేరింది. భర్త పవన్ తో కలిసి బైక్ పై వెళుతుండగా ఉప్పరిపాలెం శివారులో వేగంగా దూసుకువచ్చిన టాటా ఏస్ ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో బైక్ తో సహా భార్యాభర్తలు కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ గర్భిణిని హస్పిటల్ కు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే మృతిచెందింది. భర్త స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. 

Read More తెనాలిలో గంజాయి బ్యాచ్ వీరంగం... రాడ్లు, రాళ్లు, బ్యాట్లతో నలుగురిపై దాడి (వీడియో)

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గర్భిణి మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని గర్భిణి మృతికి కారణమైన ఆటోను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.