తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శన సమయంలో శ్రీకాళహస్తి యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. మంగళవారంనాడు ఆయన శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన విషయం తెలిసిందే.

ఆలయంలోకి పవన్ కల్యాణ్ అడుగు పెట్టగానే ఆలయం ద్వారాలన్నీ మూసేశారు. దీంతో భక్తులు తిప్పలు పడక తప్పలేదు. వారు విసుక్కున్నారు కూడా. సాధారణంగా ఏకాంత సేవ వరకు ప్రతి రోజూ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఏకాంత సేవ వరకు సుబ్రభాతం, గోపూజ తర్వాత కంచుగడప తెరుస్తారు. 

పవన్ కల్యాణ్ అభిమానులను నియంత్రించేందుకు ఆలయ అధికారులు తలుపులు మూసేసి, ఇతరులు రాకుండా గార్డును పెట్టారు. భక్తులు 15 నుంచి 20 నిమిషాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సమయంలో వారు ఇబ్బందులకు గురయ్యారు.

ఆ విధమైన సందర్శకులకు ఏమైనా ప్రోటోకాల్ ఉందా అని భక్తులు మండిపడ్డారు. సామాన్య భక్తులను ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు