మంత్రి పల్లె రఘునాధరెడ్డి తన అజ్ఞానాన్ని తానే బయటపెట్టుకున్నారు. స్వామి భక్తి ఎక్కువై పోయేసరికి ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదు

చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి తన అజ్ఞానాన్ని తానే బయటపెట్టుకుంటున్నారు. మెడమీద తలకాయ ఉన్న వారెవరికైనా రోజుకు ఉండేది 24 గంటలే అన్న విషయం చెబుతారు. అలాగే, రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరైనా సరే ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఎన్ టిఆర్ పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాతే చంద్రబాబు టిడిపిలో చేరారన్న విషయం అందరికీ తెలిసిందే. వాస్తవం ఇది కాగా ఇందిరాగాంధి, రాజీవ్ గాంధిలనే నారావారి కుటుంబం ఎదిరించి నిలబడిందని చెప్పటంతో పలువురు విస్తుపోతున్నారు.

ఇందిరాగాంధి లేక రాజీవ్ గాంధిలు ప్రధానులుగా పనిచేసినపుడు చంద్రబాబు స్ధాయి ఏమిటి? కేవలం మంత్రి లేదా టిడిపిలో ప్రధాన కార్యదర్శి. ఈ విషయాలు కూడా అందరికీ తెలిసిందే. ఇక పోతే వారిద్దరినీ నారావారి కుటుంబం సమర్ధవంతంగా ఎదుర్కోవటం ఏమిటి? నారావారి కుటుంబం అంటే చంద్రబాబు ఒక్కడే కదా? అక్కడికి చంద్రబాబు కుటుంబం ఏదో దశబ్దాల పాటు రాజకీయంగా చాలా బలమైన కుటుంబం అన్నట్లు పల్లె బిల్డప్ ఇస్తున్నారు.

ఇక రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ప్రపంచదేశాలు పెట్టుబడుల కోసం క్యూ కడుతున్నట్లు మరో కథ చెప్పారు. నిజంగానే ప్రపంచదేశాలు క్యూలు కడుతుంటే మరి అన్నేసి కోట్లు ఖర్చు పెట్టుకుని చంద్రబాబు విదేశాలకు పెట్టుబడుల కోసం ఎందుకు వెళుతున్నట్లు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు ప్రజాధనంతో విహారయాత్రలు చేస్తున్నారా? పోయిన ఏడాది జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ. 4.70 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని స్వయంగా చంద్రబాబు చెబుతుంటే మంత్రేమో రూ. 2.6 లక్షల కోట్లే అని చెప్పటమేమిటి? తాజాగా జరిగిన ఒప్పందాల వల్ల 22 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని చంద్రబాబు చెబుతుంటే మంత్రేమో కేవలం 2 లక్షల మందికే ఉద్యోగాలు వస్తాయని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.