నందవరం చౌడమ్మ జ్యోతుల గురించి నాలుగు ముక్కలు...

The colorful jyothy festival  of Andhras Nandavaram chowdamma
Highlights

నందవరం తిరునాళ్ల చివరిరోజు చౌడమ్మ  తల్లికి విశ్వబ్రాహ్మణుడు దిష్టి చుక్క పెడతాడు.

కాలి బొటనవేలుతో చుక్క పెడతారని కొందరు, దిగంబరుడై చుక్క పెడతాడని  ఇంకొందరు. 

ఎలా చుక్క పెడతాడో మరొక కంటికి తెలియని నందవర రహస్యం అది.

అప్పట్లో కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ సభ్యుడు,నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఒక కార్యక్రమ నిమిత్తం నంద్యాల నుంచి బనగానపల్లెకు వెళుతున్నారు.వారి కాన్వాయ్ లో వారు ప్రయాణిస్తున్న కారు మాత్రం కొన్ని సాంకేతిక సమస్యలవల్ల ఆగిపోయింది.పక్కకు చూసిన పీవీ గారికి ఒక ఎత్తైన ఆలయ రాజగోపురం కనిపించగా కుతూహలంతో ఆ ఆలయ విశేషాలడగ్గా అదిచౌడమ్మ ఆలయమని,ఈ గ్రామమ పేరు నందవరమని చెప్పారు.ఆశ్చర్యపోయిన వారు మేమూ నందవరీకులమేనంటూ అమ్మవారిని దర్శించుకుని వెళ్లాడంటూ జనాలు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు   

చరిత్రలో ఆంధ్ర పదకవితా పితామహుడు అల్లసాని పెద్దన,సంకీర్తనాచార్యుడు అన్నమయ్య,తరిగొండ వెంగమాంబ లాంటి ఎందరో ఈ నందవరీకులే.ఈ నందవరీక బ్రాహ్మణులు ఇక్కడికి రావడానికి,చౌడమ్మ తల్లి ఇక్కడ వెలసిన వైనం గురించి జనంలో ఉన్న కథలను తెలుసుకుందాం.

 

హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చంద్రవంశీయులు కాలక్రమేణా బలహీనపడి దక్షిణ భారతానికి వచ్చారు.నందవరాన్ని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ఉన్న విఠలాపురం,అప్పలాపురం,వెంకటాపురం అనే అష్ట పురాలను కలుపుకుని జనరంజకంగా పాలన సాగించారు.వారిలో ఒకరైన ఉత్తంగభుజుడు సతీసమేతంగా అహోబిల క్షేత్రాన్ని సందర్శించగా స్వప్నంలో నారసింహుడు కనిపించి చరిత్రలో నిలిచిపోయే పుత్రుడు జన్మిస్తాడని అశీర్వదించాడట.ఆ వరప్రసాది పేరు నందుడు.తీవ్ర జపతపాల ద్వారా దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని నిత్యం కాశీ విశ్వనాధున్ని సేవించాలన్న కోరిక అడగ్గా దత్తాత్రేయుడు మంత్ర పాదుకల్ను అనుగ్రహించాడు.

 

నిత్యం పాదుకలు ధరించి సూర్యోదయానికి ముందే కాశీనాధున్ని సేవించి తిరిగి వచ్చేవాడు.నిత్యం ఒక సమయంలో అంతర్ధానమవుతున్న రాజు ను గమనించిన రాణి నిలదీసింది.రాజు రాణితో సహా కాశీపతిని సేవించి తిరుగుప్రయాణానికి సన్నద్దమయ్యాడు.ఈలోగా రాణికి రుతుక్రమం జరిగింది.పాదుకల మంత్రశక్తి పోయింది.ఇక తిరిగి రాజ్యం చేరాలంటే ఏళ్లూపూళ్లు పడుతుందో లేక జీవితకాలం లో చేరుకోలేక పోవచ్చు కూడా(అప్పట్లో కాశికి పోయినవారు,కాటికి పోయిన వారు అన్న సామెతౌండేది కదా).విచారిస్తున్న రాజు దగ్గరికి కాశీ బ్రాహ్మణులు వచ్చి అభయం ఇచ్చి పాదుకలకు తిరిగి మంత్రబలం వచ్చేట్లు చేసారు.నందుడు వీడ్కోలు చెబుతూ వారికి కోరిన సాయం ఎప్పుడైనా సరే చేయగలనని మాట ఇచ్చి వచ్చాడు.

 

కొన్నాళ్లకు కాశీ నగరం చుట్టు పక్కల భయంకర క్షామం సంభవించింది.అక్కడి బ్రాహ్మణులు నందవరం చేరి నందుడికి వారికిస్తా అన్న మాటను గుర్తు చేసాడు.మీకిచ్చిన మాటకు సాక్ష్యమెవరని అడిగాడు నందుడు.కాశీ విశాలాక్షే మాకు సాక్షంటూ ప్రార్ధించారు బ్రాహ్మణులు.కదలివచ్చిన కాశీ విశాలక్షి ని చూసి తపో నిష్టులైన విపులు నిన్ను సాక్షిగా పిలుస్తారు,నాకు నీ దర్శనభాగ్యం కలగాలనే సాక్ష్యం అడిగాను అంటూ నందుడు ఆ తల్లిని ఇక్కడే ఉండమని కోరగా చౌడేశ్వరీ మాతగా వెలసిందని,విప్రులకు మాన్యాలనిచ్చి రాజు అభిషేక నిమిత్తం 108 బావులు తవ్వించాడని కథనం.

 

జ్యోతి ఉత్సవాలు

 

ప్రతి ఉగాది నుంచి నాలుగురోజుల పాటూ అమ్మవారి తిరునాళ్లు జ్యోతి ఉత్సవల పేర ఘనంగా జరుగుతాయి.చివరిరోజు అమ్మవారికి దిష్టి చుక్క పెడతారు.ఆలయాన్ని మూసి గర్భాలయం చుట్టూ తెరలు కడతారు.ఒక విశ్వబ్రాహ్మణుడు తెరలు దాటి లోనికి వెళ్లి అమ్మవారికి దిష్టి చుక్క పెడతాడు.దానికి సంబంధించి జనాల్లో వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.కొందరు లోనికి వెళ్లి నిలువెత్తు అమ్మవారికి కాలి బొటనవేలుతో చుక్క పెడతాడంటే,కొందరు అతను దిగంబరుడై చుక్క పెడతాడని,మరికొందరు అధర్వణ వేద మంత్రాలు పఠిస్తాడని చెప్పుకుంటారు.ఏదైనా చిదంబర రహస్యంలానే ఇదీ రహస్యమే.ఈ దిష్టిచుక్క పెట్టే కార్యక్రమానంతరం ఆలయం వెలుపల జొన్న చొప్ప నెగడు వెలిగిస్తారు.అప్పుడు గ్రామమ లో వెలసిన చెన్నకేశవాలయం నుంచి జ్యోతుల రాక మొదలవుతుంది.మొక్కుబడి ఉన్నవాళ్లు బెల్లం పాకంలో జొన్న,బియ్యం పిండి కలిపి ఒక పెద్ద ముద్దగా తయారు చేస్తారు.దీని మధ్య ఒక గుంటలా చేసి నెయ్యితో నింపి జ్యోతి వెలిగిస్తారు.దీని చుట్టూ ఆకర్షణీయమైన అలంకారం చేసి ఒక్కొక్కరూ ఒక చిన్న సమూహంగా మేళతాళాలతో,ఆట పాటలతో మధ్య మధ్య మేకపిల్లలను బలి ఇస్తూ ఆలయం చేఉకుంటారు.ఒకరివెనక ఒకరు సుమారు 300 జ్యోతుల దాకా ఉంటాయి.ఈ సారి ఏప్రిల్ ఒకటోతేదీ రాత్రి జ్యోతులుంటాయి.

ఆలయం లోపల మాత్రం జంతుబలులు నిశిద్ధం.ఇక ఆలయ ప్రాంగణంలోనే ఉన్న కలి పళ్ల చెట్టు అమ్మవారి చీర చెరగుతోపాటూ వచ్చిందని కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు.ఆలయ సమీపంలో ఉన్న దత్తాత్రేయ పాదుకల ఆలయ ఉనికి అక్కడ జరుగుతున్న మైనింగ వల్ల ప్రమాదంలో పడింది.ఇక గ్రామం లో కొన్ని బావులను పూడ్చి కబ్జా చేసారు.

 

ఈ జ్యోతి ఉత్సవాల్లో ప్రధానంగా ధర్మవర,బెంగుళూరు,షోలాపూరుల్లో స్థిరపడ్డ తొగటవీరులు పాల్గొంటారు.వీరికి చౌడమ్మ ఇలవేల్పు. 

 

నందవరీక బ్రాహ్మణులంటూ ఈ గ్రామంలో ఎవరూ లేరు.ఆలయ అర్చకులు కూడా తొగటవీర క్షత్రియులే. 

 

ఇవీ నందవరం చౌడమ్మ ఆలయ విశేషాలు.

 

సమీపంలోనే యాగంటి పుణ్యక్షేత్రం,బెలుం గుహలనూ సందర్శించవచ్చు.

 

loader