పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు వార్తా కథనాన్ని ప్రచురించిందని పేర్కొంటూ ఈనాడు దినపత్రికపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఆ సంస్థ ఎండీ, ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్, బ్యూరో చీఫ్ కోర్టులో ఫిర్యాదు చేయాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్, బ్యూరో చీఫ్ కోర్టులో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యింది. దీని కోసం ఏపీ జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 

పోలవరం ప్రాజెక్టుపై 2023 మే 12వ తేదీన తప్పుడు వార్తా కథనాన్ని ప్రచురించిందని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ఈనాడుపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఆ దినపత్రిక ఎండీతో పాటు ఆ కథనం ప్రచురితమవడంలో పాత్ర ఉన్న పలువురిపై ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ‘దక్కన్ క్రానికల్’ నివేదించింది. 

‘పోలవరం జగమంత వైపాళ్యం’ (పోలవరం ప్రాజెక్టు వైఫల్యం) శీర్షికన వచ్చిన ఈ వార్తా కథనంలో ఈ ప్రాజెక్టుపై అనేక తప్పుడు ఆరోపణలు, ప్రకటనలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతమైన దురభిప్రాయాన్ని కలిగించిందని తెలిపింది. ప్రజల దృష్టిలో దాని ప్రతిష్ఠ, సమగ్రతను దెబ్బతీసిందని పేర్కొంది. 

ఏపీ జలవనరుల శాఖ, సంబంధిత ప్రభుత్వ అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఈ వార్తాకథనం ఉందని ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని వ్యాఖ్యానించడంపై ఈ వార్తాకథనం ఆధారపడి ఉందని తెలిపింది. దీంతో ఈనాడు ఎండీ, ఇతరులపై కోర్టులో ఫిర్యాదు చేయాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.