పాడేరు: తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంతపార్టీ కాదని ఆయన మామ దివంగత సీఎం ఎన్టీఆర్ దగ్గర లాక్కున్న పార్టీ అని విమర్శించారు. 

విశాఖపట్నం జిల్లా పాడేరులో బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సొంత పార్టీ లేదన్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కాదన్నారు. వేరే వ్యక్తి పార్టీ పెట్టుకుంటే జగన్ ఆ పార్టీని లాక్కున్నాడని చెప్పారు. 

కానీ జనసేన పార్టీ అలా లాక్కున్న పార్టీ కాదని ప్రజల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని స్పష్టం చేశారు. ఈ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు యువతకు విద్య ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ అంటూ పవన్ స్పష్టం చేశారు. 

అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందుతున్న పార్టీ జనసేన పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. పాడేరు అభివృద్ధికి జనసేన కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. గిరిజనుల హక్కులను కాలరాస్తే ఆ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆస్ట్రేలియాలో ప్రైమ్ మినిస్టర్ గత ప్రభుత్వాలు గిరిజనులకు అన్యాయం చేస్తే చట్టసభలో జాతికి క్షమాపణలు చెప్పారని ఆ విషయాన్ని గుర్తు చేశారు. అమెరికాలాంటి దేశాలు కూడా క్షమాపణలు చెప్తున్నాయని తెలిపారు. కానీ రాష్ట్ర నేతలు మాత్రం దోపిడీయే ముఖ్యంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. 

దోపిడీ దారుల తాట తీస్తానని హెచ్చరించారు. జనసేన పార్టీ ప్రవేశపెట్టే తీర్మాణాలలో మెుదటి తీర్మానం గిరిజనులకు క్షమాపణలు చెప్తూ తీర్మానం పెట్టబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. గిరిజనులు జాతి సంపద అంటూ వ్యాఖ్యానించారు. ఎవరో వచ్చి దోచుకుంటే జనసేన చూస్తు ఊరుకోదన్నారు. 

వామపక్ష పార్టీలతో కలిసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇకపోతే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చెయ్యకుండా ఉంటున్న పవన్ కళ్యాణ్ పాడేరు సభవేదికగా రెచ్చిపోయారు. 

టీజీ వెంకటేష్ దగ్గర నుంచి మెుదలు పెట్టి చంద్రబాబు వరకు ఉతికి ఆరేశారు. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పై పవన్ విరుచుకుపడటం చంద్రబాబు నాయుడు టీజీ వెంకటేష్ కి వార్నింగ్ ఇవ్వడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

దోపిడీ చేస్తే తాట తీస్తా, మైనింగ్ జోలికి వస్తే ఇక అంతే : టీడీపీకి పవన్ హెచ్చరిక

అదుపుతప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని జాగ్రత్త : టీజీ వెంకటేష్ కు పవన్ వార్నింగ్

గుట్టు విప్పిన టీజీ వెంకటేష్: జనసేనతో టీడీపి పొత్తు

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం