కర్నూలు: తెలుగుదేశం, జనసేనల మధ్య స్నేహబంధం బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన గుట్టును తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ విప్పారు. జనసేనతో తెలుగుదేశం పార్టీకి పెద్దగా విభేదాలు లేవని ఆయన అన్నారు. 

జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య మార్చిలో చర్చలు జరిగే అవకాశం ఉందని టీజీ వెంకటేష్ చెప్పారు. రెండు పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీపై ఆశలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

కేంద్రంపై పోరాటం విషయంలోనే ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయని అన్నారు. ఇరు పార్టీల నాయకుల మధ్య సదభిప్రాయం ఏర్పడిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బిఎస్పీ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపి, జనసేన కలిస్తే తప్పేమిటని ఆయన అడిగారు.  

కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం తన కుమారుడికి వస్తుందని ఆశిస్తున్నట్లు టీజీ వెంకటేష్ చెప్పారు. సర్వే ఫలితాలను బట్టి పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. కర్నూలు సీటు తనకే వస్తుందని బీవీ మోహన్ రెడ్డి చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు.