కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ కేంద్రంలో టెన్షన్ మొదలైంది. అభివృద్ధిపై టిడిపి నేతలు చేసిన సవాలుకు వైసిపి కడప ఎంపి ప్రతిసవాలు విసరటంతో టెన్షన్ పెరిగిపోయింది. అభివృద్దిపై ప్రధానప్రతిపక్షానికి సవాళ్ళు విసరటం తర్వాత పోలీసులను ప్రయోగించటం టిడిపి నేతలకు మామూలైపోయింది. పోలవరంపై చర్చకు సవాలంటూ అప్పట్లో రాజమండ్రి ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి సవాలు విసిరారు. దానికి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తే పోలీసులను ప్రయోగించారు.

తర్వాత గుంటూరు జిల్లాలో సత్తెన్నపల్లిలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ టిడిపి నేత బోండా ఉమ సవాలు విసిరారు. దానికి వైసిపి నేత అంబటి రాంబాబు స్పందించగానే వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా పులివెందుల అభివృద్ధిపై టిడిపి నేత  సతీష్ రెడ్డి సవాలు విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధికి, గడచిన మూడున్నరేళ్ళలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రెడీ అంటూ సతీష్ సవాలు విసిరారు.

టిడిపి నేత సవాలుకు కడప ఎంపి అవినాష్ రెడ్డి స్పందించారు. ఆదివారం సాయంత్రం పులివెందులలోని పూలఅంగళ్ళ ప్రాంతంలో చర్చకు వేదికగా టిడిపి నేతే నిర్ణయించారు. అయితే, ఉదయం నుండి పోలీసులు రంగంలోకి దిగారు. అవినాష్ ను ఇంటి నుండి బయటకు రావటానికి పోలీసులు అనుమతించటం లేదు.

బహిరంగ చర్చకు ఎవరికీ అనుమతించటం లేదంటూ పోలీసులు ఎంపికి స్పష్టం చేశారు. పోలీసులు ఒక్క ఎంపి ఇంటిపైన మాత్రమే దృష్టి పెట్టారు. ఒకవేళ ఎంపి గనుక ఇంటి నుండి బయటకు రావటానికి ప్రయత్నిస్తే బహుశా పోలీసులు అరెస్టు చేసినా చేయవచ్చు. ఎందుకంటే, ఎంపి అనుచరులను, వైసిపి నేతలను ఉదయం నుండే పోలీసు స్టేషన్ కు పిలిపించుకుంటున్నారు. సాయంత్రం వరకూ స్టేషన్లోనే ఉండాలంటూ నిర్భందిస్తున్నారు. దాంతో సాయంత్రంలోగా పులివెందులలో ఏమి జరుగుతుందో అర్ధంకాక టెన్షన్ గా ఉంది.