చంద్రబాబులో టెన్షన్...కారణాలివేనా ?

First Published 1, Jan 2018, 11:15 AM IST
Tension mounting up over naidu on Delhi developments
Highlights
  • ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు చంద్రబాబునాయుడులో రోజురోజుకు టెన్షన్ పెంచేస్తున్నాయ్.

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు చంద్రబాబునాయుడులో రోజురోజుకు టెన్షన్ పెంచేస్తున్నాయ్. 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబును ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకవైపు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. ఇంకోవైపు రాష్ట్రస్ధాయిలో భాజపాతో దోస్తీ విషయంలో సందిగ్దత. అదే సమయంలో తన విషయంలో ప్రధానమంత్రి వైఖరి అర్ధంకాకపోవటంతో భవిష్యత్తేంటో అర్ధం కాక ఆందోళన పెరిగిపోతోంది.

ప్రతిపక్ష వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాల అపూర్వ స్పందనతో టిడిపి ఇబ్బందులో పడింది. రాష్ట్రంలోని భాజపా నేత సోము వీర్రాజు చంద్రబాబును వరసబెట్టి వాయించేస్తున్నారు. రోజురోజుకు రెచ్చిపోతున్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వీర్రాజు రెచ్చిపోతుండటంపై అనుమానాలు మొదలయ్యాయి.

మొదటి నుండి చంద్రబాబును తీవ్రస్ధాయిలో వ్యతిరేకిస్తున్న భాజపా నేతల్లో వీర్రాజు ముందువరసలో ఉంటారు. అవకాశం దొరికినపుడల్లా చంద్రబాబుపై రెచ్చిపోయే ఎంఎల్సీ మధ్యలో కొంతకాలం మౌనంగా ఉన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన నేపధ్యంలో మళ్ళీ రెచ్చిపోతున్నారు. జాతీయ నాయకత్వం మద్దతు లేకుండా వీర్రాజు ఆ స్ధాయిలో రెచ్చిపోతారా అనే సందేహం వస్తోంది.

కీలకమైన మరో అంశమేమిటంటే చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్రమోడి పూర్తిగా దూరం పెట్టటం. ఏడాదిన్నరగా ప్రధాని అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధించలేకపోతున్నారు. మళ్ళీ, ఇందులో చంద్రబాబును ఇరుకునపెడుతున్న విషయం మరొకటి ఉంది.

అదేమిటంటే, ఏడాదిన్నరగా తనకు అపాయిట్మెంట్ ఇవ్వని ప్రధానమంత్రి వైసిపి నేతలకు మాత్రం ఇస్తుండటం. ఇదే ఏడాదిలో  రాష్ట్రపతి ఎన్నికలకు ముందు 15 నిముషాల పాటు జగన్మోహన్ రెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు. తర్వాత లక్ష్మీపార్వతితో కూడా సమావేశమయ్యారు. తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో 15 నిముషాలు మాట్లాడారు.

ఈ విషయంలోనే మోడి వైఖరి ఏంటో అర్ధంకాక చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి భాజపా ఏమైనా నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు టిడిపిలో మొదలైంది. ఒంటరిగా పోటీ చేయాలనో లేక వైసిపితో జట్టు కట్టాలనో నిర్ణయం తీసుకోకపోతే తమను ఉద్దేశ్యపూర్వకంగా మోడి ఎందుకు దూరం ఉంచుతారనే చర్చ టిడిపిలో జోరందుకుంది. మరి, వీళ్ళ ప్రశ్నకు సమాధానం కొత్త సంవత్సరంలో అయినా దొరుకుతుందో లేదో?  

 

loader