ఈనెల 24వ తేదీన అభ్యర్ధిని కూడా ప్రకటిస్తామంటూ మంత్రి అఖిలప్రియ చేసిన ప్రకటన పార్టీలో కలకలం రేపింది. దానికితోడు సిఎంతో భేటీ తర్వాత నంద్యాలలో పోటీ చేయబోయేది తానేనంటూ శిల్పా చేసిన ప్రకటన పార్టీలో బాగా వేడి రాజేసింది.
తెలుగుదేశంలో నంద్యాల హీట్ పెరిగిపోతోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవ్వరూ వెనక్కు తగ్గట్లేదు. టిక్కెట్టు కోసం ఎవరికి వారే పట్టుబడుతుండటంతో చంద్రబాబునాయుడుకు ఏం చేయాలో తోచటం లేదు. ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో సీటు ఖాళీ అయింది. దాంతో తమ తండ్రి పోటీ చేసిన నినయోజకవర్గం కాబట్టే అక్కడ పోటీ చేసే అవకాశం తమ కుటుంబానికే ఇవ్వాలంటూ భూమానాగిరెడ్డి కూతురు, మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి, ఇప్పటికే అఖిలకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇపుడు పోటీ చేసే అవకాశం తనకే దక్కాలంటూ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి పెడుతున్నారు. ఎన్నిమార్లు చర్చలు జరిపినా రెండు వర్గాలు వెనక్కు తగ్గటం లేదు.
టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేందుకు బుధవారం రాత్రి చంద్రబాబు సమక్షంలో శిల్పా వర్గం జరిపిన చర్చలు ఇంకా సా....గుతున్నాయి. ముందుగా అఖిలప్రియ తర్వాత శిల్పా సోదరులు చంద్రబాబుతో విడివిడిగా సమావేశమై ఎవరి వాదనలు వారు వినిపించారు. అయితే, నంద్యాల సీటులో పోటీ చేసే అవకాశం భూమా కుటుంబానికే ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా అర్ధమైపోతోంది.
అయితే, నియోజవర్గంలో శిల్పా వర్గానికి కూడా బలమైన అనుచరగణముంది. ఒకవేళ శిల్పా మోహన్ రెడ్డి గనుక ఎదురుతిరిగితే టిడిపి విజయం అంత ఈజీకాదు. అందులోనూ శిల్పా గనుక వైసీపీలో చేరి పోటీ చేస్తే టిడిపికి మరింత ఇబ్బందే. అందుకనే శిల్పను బుజ్జగించే పనిలో పెట్టుకున్నారు. కానీ శిల్ప ఏమో ఎంత చెప్పినా వినటం లేదు. వారం క్రితం ఇదే విషయమై శిల్పాపైన ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు మళ్ళీ తనంతట తానే శిల్పను పిలిపించుకున్నారంటేనే అర్ధమవుతోంది నియోజకవర్గంలో శిల్పా సోదరుల ప్రాబల్యం.
ఇంకోవైపేమో నంద్యాలలో పోటీ చేసేది తమ కుటుంబమేనని, ఈనెల 24వ తేదీన అభ్యర్ధిని కూడా ప్రకటిస్తామంటూ మంత్రి అఖిలప్రియ చేసిన ప్రకటన పార్టీలో కలకలం రేపింది. ఇప్పటి వరకూ టిక్కెట్ల కేటాయింపు, అభ్యర్ధుల ప్రకటన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి మాత్రమే చేసేవారు. అటువంటిది నంద్యాల విషయంలో ఏకపక్షంగా అఖిల చేసిన ప్రకటనతో నేతలందరూ ఆశ్చర్యపోయారు. అయితే, చంద్రబాబు ఆమోదంతోనే అఖిల ప్రకటన చేసిందని కూడా ప్రచారంలో ఉంది. శిల్పాతో భేటీ ముందే అఖిల ప్రకటన చేయటంతోనే సమస్య మరింత జటిలమైంది. దానికితోడు సిఎంతో భేటీ తర్వాత నంద్యాలలో పోటీ చేయబోయేది తానేనంటూ శిల్పా చేసిన ప్రకటన పార్టీలో బాగా వేడి రాజేసింది.
