వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఎంపిల రాజీనామా ప్రకటనతో టిడిపి ఉలిక్కిపడింది. ఇదే ప్రకటనను 2016లో కూడా చేసినా అప్పట్లో ప్రత్యేకహోదాపై ఎవరిలోనూ ఇంతటి సీరియస్ నెస్ లేదు. అప్పటి పరిస్ధితులు కూడా వేరు. అప్పట్లో జగన్ ఒక్కడే ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేశారు. కానీ తాజా పరిస్ధితుల్లో బిజెపి మినహా టిడిపితో పాటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా ప్రత్యేకహోదా కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి హోదా డిమాండ్ మరింత ఊపందుకున్నది.

ఇటువంటి నేపధ్యంలోనే జగన్ ఎంపిల రాజీనామాపై మరోసారి ప్రకటించారు. కాకపోతే ఈసారి స్పష్టంగా రాజీనామాల తేదీ కూడా ప్రకటించారు. దాంతో టిడిపిలో కలవరం మొదలైంది. ఎందుకంటే, రాజీనామాల గురించి జగన్ ప్రకటించక ముందే టిడిపి ఎంపిల రాజీనామాలపై అన్ని వైపుల నుండి ఒత్తిళ్ళు మొదలయ్యాయి. అయినా చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదు.

ఈ నపధ్యంలోనే జగన్ చేసిన రాజీనామల ప్రకటనతో చంద్రబాబుపైన కూడా ఒత్తిడి మొదలైంది. దాని పర్యవసానమే టిడిపి నేతల నుండి జగన్ పై మాటల దాడులు మొదలవ్వటం. రాష్ట్రంలో ఎక్కడికక్కడ టిడిపి ఎంపిల రాజీనామాలపై డిమాండ్లు మొదలయ్యాయి. ప్రతిపక్షంలోని వైసిపి ఎంపిలే రాజీనామాకు సిద్దపడినపుడు అధికార టిడిపి ఎంపిలు మాత్రం ఎందుకు రాజీనామాలు చేయరంటూ జనాలు నిలదీస్తున్నారు. దాంతో టిడిపి ఎంపిలపైన కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ పరిస్ధతుల్లో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.