అమరావతి: తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా సోకింది. ఈ మేరకు ఆదివారం నాడు వైద్యులు నిర్ధారించారు. దీంతో గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

గుంటూరు జిల్లాలోని పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు ఇప్పటికే కరోనా సోకిన విషయం తెలిసిందే.తాను ఆరోగ్యంగానే ఉన్నట్టుగా ఎమ్మెల్యే శివకుమార్ ప్రకటించారు. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష చేయించుకొన్నట్టుగా ఆయన తెలిపారు. మూడో సారి పరీక్షలో కరోనా పాజిటిగా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు.

మూడు రోజులుగా జలుబుతో తాను బాధపడుతున్నట్టుగా ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు.  గత వారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే శివకుమార్ ఆదివారంనాడు తన అభిమానుల కోసం వీడియో సందేశం పంపారు. నాకు  పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలు ఎవ్వరూ కంగారు ఆందోళన చెందవద్దు. ప్రజలకు నిత్యం ఫోన్‌లో అందుబాటులో ఉంటాను. దయచేసి ప్రజలు ఎవ్వరూ పని లేకుండా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని ఆయన సూచించారు.ఇప్పటికే తెనాలి మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, పలువురు వైద్య సిబ్బంది కరోనాబారినపడ్డారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు 44,609కి చేరుకొన్నాయి. శనివారం నాడు ఒక్క రోజే 3,963 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివవరకు రాష్ట్రంలో కరోనాతో 586 మంది మరణించారు.రాష్ట్రంలో కరోనా కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నిలిచింది. మూడో స్థానంలో  అనంతపురం జిల్లా నిలిచింది. వరుసగా మూడు రోజులుగా రెండు వేల కేసులు రాష్ట్రంలో నమోదు కావడం కొంత ఆందోళన కల్గిస్తోంది.