అమరావతి: తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు శుక్రవారం ఉదయం నుండి  ఆందోళనకు దిగారు. దీంతో ఏపీలోని పలు దేవాలయాల్లో  తలనీలాలు బందయ్యాయి.

 ఏపీ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో తమకు సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ తో  క్షురకులు  ఆందోళనకు దిగారు.  కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తక్షణమే తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలను కల్పించాలని నాయిబ్రహ్మణులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ విమరణ చేసిన వారికి  ప్రతి నెల రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కూడ క్షురకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

అంతేకాదు విజయవాడలోని దుర్గగుడిలో పనిచేస్తున్న క్షురకుడి పట్ల అనుచితంగా వ్యవహరించిన బోర్డు సభ్యుడిపై  చర్యలు తీసుకోవాలని కూడ క్షురకులు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో  క్షురకులు  విధులకు హాజరౌతున్నారు.  కానీ, ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో  ఇవాళ విధులను బహిష్కరించారు. 

ఏపీ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో  క్షురకులు ఆందోళనకు దిగడంతో  తలనీలాలు బందయ్యాయి. తిరుమలలో కూడ  జూన్ 16వ తేది నుండి  కేశఖండనను నిలిపివేయనున్నట్టు  క్షురకులు ప్రకటించారు.