దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రామతీర్థం విగ్రహ ధ్వంసం కేసులో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రథయాత్ర నిర్వహించాలని యోచిస్తోంది. 

దేవాలయాల పరిరక్షణకు రథయాత్ర దిశగా బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రామతీర్ధం నుంచి రామ రథయాత్ర పేరుతో ఈ యాత్ర చేపట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఆలయాలు, విగ్రహాలపై దాడులు వంటి అంశాలపై యాత్రలో బీజేపీ నేతలు ప్రసంగించనున్నారు. 

ఈ రథయాత్రలో బీజేపీ జాతీయ నాయకులను భాగస్వాములు చేయనున్నట్టు తెలుస్తోంది. విగ్రహాలపై దాడులు జరిగిన ప్రాంతాల్లో రథయాత్ర నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్‌పై చర్చించేందుకు ఈ నెల 17న వైజాగ్‌లో బీజేపీ కోర్ కమిటీ భేటీ కానుంది.