తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష పదవికి నాదెండ్ల బ్రహ్మం చౌదరి రాజీనామా చేశారు. వ్యక్తిగత సమస్యలతోనే రాజీనామా చేశానని.. ఇది తన సొంత నిర్ణయమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదని బ్రహ్మం చౌదరి తెలిపారు.

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తనను చంద్రబాబు ప్రోత్సహించారని బ్రహ్మం చౌదరి గుర్తు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటూనే సామాజిక సమస్యలపై పోరాడుతానని బ్రహ్మం చౌదరి స్పష్టం చేశారు. 

కొద్దిరోజుల క్రితం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవడం సంచలనం కలిగించింది. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి.

Also Read:నియోజకవర్గం కోసమే: జగన్‌తో భేటీపై మద్దాలిగిరి వ్యాఖ్యలు

సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గ సమస్యలతో పాటు సీఎఫ్ఎంఎస్ బకాయిల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు.

దీనిపై సీఎం వెంటనే స్పందించి రూ.25 కోట్ల బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గిరి వెల్లడించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిందని.. అలాంటి విప్లవం తిరిగి జగన్ పాలనలోనే వస్తుందనే నమ్మకం ఉందని గిరి ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:బాబుకు షాక్: వైసీపీలో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే మద్దాలిగిరి, క్యూలో మరికొందరు..?

తమ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పాలనే ఆలోచనలో ప్రస్తుతం పేద ప్రజలు ఉన్నారని.. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మద్దాలి గిరి విమర్శించారు.

రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని మద్దాలి గుర్తుచేశారు. రాజధాని అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన ఆలోచన ఉందని.. లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ఆయన తనతో చెప్పారని మద్దాలిగిరి తెలిపారు.