2019 అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికతో పాటు మేనిఫెస్టో రూపకల్పన వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతుండటంతో అధికారపార్టీ కూడా అప్రమత్తమైంది.

దీనిలో భాగంగా ఎన్నికల్లో అత్యంత కీలకపాత్ర పోషించే మేనిఫెస్టోను రూపొందించేందుకు సీనియర్ నేతలతో కమిటీని నియమించనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. యనమల నేతృత్వంలో కమిటీ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొత్త హామీలపై టీడీపీ కసరత్తు చేయనుంది. కాగా, ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోగా పలు కీలకనిర్ణయాల అమలుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొత్త అంశాలతో మేనిఫెస్టో ఎలా రూపకల్పన చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎవ్వరూ ఊహించని విధంగా తమ మేనిఫెస్టో ఉంటుందని,సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటున్నారు టీడీపీ పెద్దలు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత ఇలా ప్రతివర్గాన్ని టచ్ చేసే అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తామంటున్నారు. మరోవైపు ప్రజాకర్షణకరంగా మేనిఫెస్టోను సిద్ధం చేయాలని టీడీపీ అధినేత కమిటీని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.