అసెంబ్లీలో అధికార వైసీపీ తీరు పట్ల తెలుగుదేశం పార్టీ గవర్నర్ హరిచందన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం శాసనసభలో, మండలిలో జరుగుతున్న పరిణామాలపై తక్షణమే జోక్యం చేసుకుని దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరింది.

స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ప్రతిపక్ష సభ్యులను బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారని తెలిపింది. మండలిలో జరుగుతున్న వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది.

తమ సభ్యులపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించడంతో పాటు చొక్కాలు సైతం చించేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. స్పీకర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకముందే మార్షల్స్ తమను బలవంతంగా బయటకు గెంటి వేశారని లేఖలో ప్రస్తావించింది. ఈ విషయాల్లో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకుని, తగిన విచారణ జరిపించాలని టీడీపీ కోరింది. 

Also Read:రౌడీల్లా ... మార్షల్స్ పిలిపించి పంపించేయండి: టీడీపీ ఎమ్మెల్యేలపై జగన్ గరం

మూడో రోజున  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో  గందరగోళం చోటుచేసుకొంది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులకు పోటీగా వైసీపీ సభ్యులు కూడ  నినాదాలు చేశారు. ఈ సమయంలో సభలో గందరగోళం చోటు చేసుకొంది. 

గందరగోళ వాతావరణం చోటు చేసుకొన్న సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు. ఈ సమయంలో సీఎం జగన్ ప్రసంగించారు. టీడీపీ సభ్యులు కనీసం పట్టుమని పదిమంది సభ్యులు కూడ లేరని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

తమ వైపున 151 మంది సభ్యులు ఉన్నారన్నారు. స్పీకర్ పోడియం చుట్టూ చేరి  రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.స్పీకర్ పోడియం వద్ద రింగ్ దాటి వచ్చిన  ఎమ్మెల్యేలను మార్షల్స్‌ను ఏర్పాటు చేసి బయటకు పంపాలని  సీఎం జగన్ కోరారు.

Also Read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

టీడీపీ ఎమ్మెల్యేలు  రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీ సభ్యులపై దాడి చేస్తే మీడియాలో  తమకు అనుకూలంగా  ప్రచారం చేసుకొనేలా టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని సీఎం జగన్ ఆరోపించారు.టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని  సీఎం జగన్ విమర్శించారు.

చేతకాకపోతే సభ బయట ఉండాలని సీఎం జగన్ టీడీపీ సభ్యులన ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పది మంది ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌ను అగౌరవపర్చే విధంగా  వ్యవహరిస్తున్నారన్నారు.

సీఎం ప్రసంగించిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. మూడు రోజులుగా టీడీపీ సభ్యులు ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. టీడీపీ సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయన్నారు.