పార్లమెంట్ చట్టం ద్వారా ఆమోదించబడిన ఏపీ రాజధాని అమరావతిని మార్చడానికి కుదరదన్నారు టీడీపీ ఎంపీలు. న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ ఎంపీలు (tdp mps) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని, చట్టాల ప్రకారమే పునర్విభజన చట్టం (ap bifurcation act) ఇప్పటికే అమలు చేశారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ (kanakamedala ravindra kumar) అన్నారు. దీని ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి (amaravathi) ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించిందని ఆయ‌న స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదని, న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని కనకమేడల హెచ్చరించారు. కొంద‌రు జడ్జిలను కూడా బెదిరించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న స్పష్టం చేశారు. న్యాయ‌స్థానం ఇచ్చిన‌ తీర్పులపై సభలో వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించకూడ‌ద‌న్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలో అప్పులు తెచ్చి ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు (rammohan naidu) ఎద్దేవా చేశారు. క‌నీసం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు, పెన్ష‌నర్ల‌కు పింఛ‌న్లు ఇచ్చేందుకు కూడా ప్ర‌భుత్వ ఆదాయం లేద‌ని ఆరోపించారు. సంప‌ద‌ను సృష్టించే ఆలోచ‌న కూడా జ‌గ‌న్‌కు లేద‌ని రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. పన్నుల‌ను విప‌రీతంగా పెంచేశార‌ని ఆయ‌న చెప్పారు. డ్రైనేజీ, చెత్త మీద కూడా ప‌న్నులు వేస్తున్నారంటూ ఫైరయ్యారు. 

ఇకపోతే.. రాజధాని అమరావతిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సీఆర్‌డీఏ (crda) ఇచ్చిన నోటీసులపై అమరావతి రైతులు అభ్యంతరం తెలిపారు. భూసేకరణ కింద తీసుకున్న భూముల్లో ప్లాట్లు కేటాయించిన అధికారులు.. ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్‌ (registration) చేయించుకోవాలని ఇటీవల రైతులకు నోటీసులు జారీ చేశారు. గతంలో భూ సమీకరణతో పాటు 2వేల ఎకరాలు భూ సేకరణ చట్టం కింద తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి భూమి యజమానులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. భూసేకరణ పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి కాకుండా, ప్లాట్లు అభివృద్ధి చేయకుండా రిజిస్ట్రేషన్ ఏంటని రైతులు (amaravathi farmers) అనుమానాలు వ్యక్తం చేశారు. తమ సందేహాలు నివృత్తి చేసిన తర్వాతే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని స్పష్టం చేస్తూ సీఆర్‌డీఏ అధికారులకు రైతులు వినతిపత్రాలు సమర్పించారు. 

మరోవైపు.. కోర్టు చెప్పినట్టుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామనే ఇప్పటికీ అంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) తెలిపారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన మాకు వున్న అధికారాలతోనే రాజధానులపై చట్టాలు (ap three capitals) చేశామన్నారు . రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడే వున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు (chandrababu naidu) అధికారం పోయిందన్న కడుపు మంటతో మాట్లాడుతున్నారంటూ బొత్స ఫైరయ్యారు. శాసనసభ సమావేశాలను జరగకుండా చేయడానికి టీడీపీ సభ్యులు ఆటంకాలు కలిగిస్తున్నారని.. కాగితాలు విసురుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.