ప్రముఖ హాస్య నటుడు, వైసీపీ నేత ఆలీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. నేడు సీఎం జగన్‌తో జరిగిన సినీ ప్రముఖుల భేటీలో ఆలీ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరో వారంలో కలుద్దామని సీఎం జగన్.. ఆలీతో చెప్పినట్టుగా తెలుస్తోంది.

ప్రముఖ హాస్య నటుడు, వైసీపీ నేత ఆలీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పనిచేసిన ఆలీకి సీఎం జగన్ రాజ్యసభ (Rajya Sabh) పదవి ఇచ్చే అవకాశం ఇవ్వనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నేడు సీఎం జగన్‌తో జరిగిన సినీ ప్రముఖుల భేటీలో ఆలీ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరి సమక్షంలోనే ‘నీకో శుభవార్త చెబుతాను.. మరో వారంలో కలుద్దాం’ అని సీఎం జగన్.. ఆలీతో చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ సీటు విషయం చర్చించేందుకు సీఎం జగన్.. ఆలీని కలవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఏపీలో త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఆ నాలుగు కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఇందులో ఒక సీటు మైనారిటీ వర్గాలకు వారికి ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కోసం పనిచేసిన ఆలీని రాజ్యసభకు పంపే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే వైసీపీలో చేరి.. ఇన్నాళ్లు పదవి కోసం ఓపికగా ఎదురుచూసిన ఆలీకి జాక్‌పాట్ తగిలినట్టేనని టాక్ వినిపిస్తోంది. 

ఇక, ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకున్న ఆలీ.. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న ఆలీకి ఎటువంటి పదవి దక్కలేదు. గతంలో కూడా పలుమార్లు ఆలీకి ఏదో ఒక పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సమయంలోనూ ఆలీ పేరు వినిపించింది. 

ఇక, త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలను వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎవరికి కేటాయిస్తారనే చర్చ జరుగుతుంది. ఇందుకు కొద్ది సమయమే ఉండటంతో అశావహులు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు జగన్ గతంలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మొత్తంగా నాలుగు స్థానాల్లో ఒక్కటి మాత్రం ఎస్సీ లేదా మైనారిటీ వర్గాలకు కేటాయిస్తారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో సాగుతుంది. ఇక, సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో త్వరలోనే ఓ స్పష్టత రానుంది.