Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు నాయుడితో ఫొటో కోసం తెలంగాణ నుంచి అమరావతికి.. ఎట్టకేలకు నెరవేరిన కల

తెలంగాణకు చెందిన ఓ అభిమాని.. చంద్రబాబుతో ఫొటో దిగడానికి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌కు పనికట్టుకుని వెళ్లాడు. పార్టీ ఆఫీసుకు వెళ్లి తంటాలు పడి ఎలాగోలా చంద్రబాబు నాయుడితో ఫొటో దిగాడు. సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఫొటో దిగడం కోసమే ఇక్కడ దాకా వచ్చాను సార్ అంటూ సంతోషంగా ఆయన పేర్కొన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో ఫొటో దిగడమే కాదు.. ప్రత్యేకంగా కొంత సేపు ముచ్చటించారు.
 

telangana youth came to amaravati for the sake of taking snap with tdp chief chandrababu naidu
Author
hyderabad, First Published Feb 24, 2022, 8:41 PM IST | Last Updated Feb 24, 2022, 8:43 PM IST

అమరావతి: కొందరు సినీ తారలను అభిమానిస్తారు. మరికొందరు రియల్ హీరోలంటే తెగ ఇష్టపడతారు. ఇంకొందరు పొలిటీషయన్స్‌ను ఆరాధిస్తుంటారు. జంగా శ్రీవర్దన్(Janga Srivardhan) ఈ మూడో కోవకు చెందినవారు. ఆయనది తెలంగాణ రాష్ట్రం వనపర్తి(Vanaparthi) జిల్లా. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. కానీ, ఆయన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అంటే చచ్చేంత ఇష్టం. చాలా కాలంగా ఆయనను కలవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. కనీసం ఒక్క ఫొటో అయినా చంద్రబాబు నాయుడితో దిగాలనే కోరిక బలంగా ఉంది. ప్రయత్నాలు చేసి చేసి.. ఇక ఆయన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా వెళ్లి తన కల సాకారం చేసుకోవాలని శ్రీవర్ధన్ నిశ్చయించుకున్నాడు. 

ఒక్క ఫొటో కోసం అది కూడా తెలంగాణలో ఉనికి కాపాడుకునే దశలోకి వెళ్లిన టీడీపీ అధినేతతో దిగడానికి జంగా శ్రీవర్దన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చారు. ఆయన మరికొందరు స్నేహితులను వెంటబెట్టుకుని అమరావతి వచ్చారు. నిన్ననే విజయవాడకు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు.. తన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలుసుకున్నారు. నేరుగా పార్టీ సెంట్రల్ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది శ్రీవర్ధన్ గురించి వివరించారు. ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు నాయుడు శ్రీవర్ధన్‌తో ఫొటో దిగారు. అంతేకాదు, ఆయనతో ప్రత్యేకంగా కొద్ది సేపు మాట్లాడారు. అతని యోగక్షేమాలు తెలుసుకుని అభినందించారు. అనంతరం, శ్రీవర్దన్.. చంద్రబాబుతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఆయనతో ఫొటో దిగడానికి ఇక్కడి దాకా వచ్చాను సార్ అంటూ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.

ఇదిలా ఉండగా, నేటికి జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 800 రోజులకు చేరింది. ఇలా ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ అలుపెరగకుండా పోరాడుతున్న ప్రజలకు మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ''మీ ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. తన మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన సీఎం జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదు'' అని చంద్రబాబు మండిపడ్డారు. 

''రాజ‌ధాని ప్రాంతం స్మశానం అన్నవాళ్లే ఇప్పుడు అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. రాజధాని విషయంలో నిలకడలేని నిర్ణయాలు, ముందు చూపులేని ఆలోచనలతో వ్యవహరిస్తున్న వైసిపి ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికే శాపంలా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి'' అని డిమాండ్ చేసారు. 

''దేశ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం ఎల్లవేళలా అండగా నిలుస్తుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రజల అభిప్రాయాలను వైసిపి ప్రభుత్వం గౌరవించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'' అని చంద్రబాబు సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios