వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ : విచారణ రేపటికి వాయిదా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు .
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల 16వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ నెల 17న తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ముందస్తు బెయిల్ పై మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన ఈ విషయమై తుది తీర్పును ఇవ్వనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే తెలంగాణ హైకోర్టుఆదేశాలను సుప్రీంకోర్టులో వైఎస్ సునీతా రెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు ఈ నెల 20న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై ఈ నెల 21న సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం విచారించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే ఇచ్చింది. ఈ నెల 24వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. మరో వైపు ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్ట్ చేయవద్దని వైఎస్ అవినాష్ రెడ్డి తరపు లాయర్ల వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
also read:వైఎస్ వివేాకా హత్య కేసు: అరెస్ట్ పై అవినాష్ రెడ్డి లాయర్ వినతిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని నిన్న సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది . ఇవాళ ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ గురించి ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో మెన్షన్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ అందిన తర్వాత వింటామని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అప్ లోడ్ అయిన విషయాన్ని న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఈ పిటిషన్ పై విచారణను రేపు వింటామని హైకోర్టు తెలిపింది. అయితే రేపు ఎన్ని గంటలకు ఈ పిటిషన్ పై విచారణ జరగనుందో ఇవాళ సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది.