చిత్తూరు: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు వేరే యువతిని పెళ్లాడటానికి సిద్దపడటంతో తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చెరువులో దూకి యువతి బలవన్మరణానికి పాల్పడింది. 

వివరాల్లోకి వెళితే... విజయపురం మండలం కాలియంబాకం ఆదిఆంధ్రవాడకు చెందిన నందని(18) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన పృథ్వి(24) అనే యువకుడు ప్రేమించుకున్నారు. మూడేళ్లుగా ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా వీరి ప్రేమాయణం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పలేదు. 

దీంతో యువకుడికి పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెళ్ళి సంబంధాలు చూడటంతో పాటు ఓ సంబంధాన్ని దాదాపు ఖాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నందని తట్టుకోలేకపోయింది. ఎక్కడ ప్రియుడు దూరమవుతాడోనని భయపడిపోయిన ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. 

రెండురోజుల క్రితం నిద్రమాత్రలు మింగిన యువతి కోలుకుని ఇంటికి చేరుకుంది. అయినప్పటికి జీవించడానికి ఇష్టపడని నందని ఇవాళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో యువతి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.